సుమారు రెండు సం.ల తరువాత మొట్ట మొదటిసారిగా భారత్-పాక్ సరిహద్దు భద్రతా దళాధికారుల మధ్య డిల్లీలో నిన్నటి నుండి మూడు రోజుల పాటు చర్చలు మొదలయ్యాయి. నిన్న జరిగిన చర్చలు చాలా సానుకూల దృక్పధంతో జరిగాయని భారత్ సరిహద్దు భద్రతా దళాల చీఫ్ డి.కె.పాఠక్ తెలిపారు. ఇకపై సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఖచ్చితంగా పాతించాలని ఇరు పక్షాలు ఒక అంగీకారానికి వచ్చాయి. సమస్యాత్మక సరిహద్దు ప్రాంతాలలో ఉమ్మడి గస్తీ నిర్వహించాలని కూడా నిర్ణయించుకొన్నారు. అవసరమయితే ఈ చర్చలను మరొకరోజు పొడిగించాలని ఆలోచిస్తున్నట్లు డి.కె.పాఠక్ తెలిపారు. మొదటిరోజు చర్చలు ముగిసిన తరువాత పాక్ రేంజర్లకు భారత్ అధికారులు మంచి విందు ఏర్పాటు చేసారు.
గతంలో కూడా ఇటువంటి చర్చలు, సమావేశాలు చాలా సార్లు జరిగాయి. అప్పుడూ ఇరు దేశాలు ఇటువంటి నిర్ణయాలే తీసుకొన్నాయి. కానీ కుక్క తోక వంకర అన్నట్లు పాకిస్తాన్ అన్ని ఒప్పందాలను ఉల్లంఘిస్తూనే ఉంది. భారత్-పాక్ దేశాల మధ్య గత కొన్నిరోజులుగా తీవ్రమయిన మాటల యుద్ధం కొనసాగుతోంది. భారత్ పై అణుబాంబు ప్రయోగిస్తామని పాక్ సైన్యాధ్యక్షుడు పరోక్షంగా హెచ్చరిస్తే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని తిరిగి భారత భూభాగంలో విలీనం చేసుకోవడమే తమ ప్రాధాన్యత అని భారత్ ప్రకటించింది. కనుక భారత్-పాక్ సరిహద్దు భద్రతా దళాధికారుల మధ్య చర్చలు సఫలం అయినంత మాత్రాన్న పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మార్చుకొంటుందని ఆశిస్తే అది అత్యాశే అవుతుంది. ఇప్పుడు జరుగుతున్న చర్చలకు పాక్ కట్టుబడితే ఇకపై సరిహద్దులో కాల్పులు జరపకూడదు. పాక్ ఉగ్రవాదులను భారత్ లోనికి ప్రవేశపెట్టే ప్రయత్నంలోనే పాక్ దళాలు సరిహద్దుల వద్ద నిత్యం కాల్పులకు పాల్పడుతుంటాయి.
ఒకవేళ కాల్పులు విరమణ ఒప్పందాన్ని పాక్ ఖచ్చితంగా పాటించదలచుకొంటే ఉగ్రవాదులను పంపలేదు. భారత్ లోకి పాక్ ఉగ్రవాదులను పంపకుండా పాక్ ఉండలేదు. కనుక ఇప్పుడు అంగీకరించిన ప్రతీ ఒప్పందాన్ని కూడా పాకిస్తాన్ మళ్ళీ ఉల్లంఘించడం తధ్యం. కేవలం ప్రపంచ దేశాల ముందు తను దోషిగా నిలబడవలసి వస్తుందనే భయంతోనే పాకిస్తాన్ ఇటువంటి చర్చలకు, సమావేశాలకు హాజరవుతుంది తప్ప నిజంగా భారత్ తో స్నేహ సంబంధాలు బలపరుచుకోవాలనే ఉద్దేశ్యంతో కాదని గత అనుభవాలు చెపుతున్నాయి. అయినప్పటికీ పాకిస్తాన్ ఈమాత్రం సానుకూలంగా వ్యవహరించినందుకే అల్పసంతోషి అయిన భారత్ చాలా సంబరపడిపోతుంటుంది. కానీ డిల్లీ గడప దాటగానే పాక్ మళ్ళీ తన వక్రబుద్ధి ప్రదర్శించడం తధ్యం.