ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన మహా సంకల్పం మహా బోర్ కొట్టించిందని కడప సభలో చాలా మంది గుసగుసలాడారు. నవ్యాంధ్రలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లిన సందర్భంగా కడపలో మహాసంకల్ప దీక్ష సభను ఏర్పాటు చేశారు. దీనికి భారీగానే ఏర్పాట్లు చేశారు.
వివిధ సందర్భాల్ల ప్రజలచేత, కార్యకర్తల చేత ప్రతిజ్జ చేయించే ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు పేరుంది. ఆ ప్రకారమే సదరు కార్యక్రమం చేపట్టారు. అది పాఠం చదివినంత సుదీర్ఘంగా ఉంది. ఇలాంటి సందర్భాల్లో చేయించే ప్రతిజ్జ క్లుప్తంగా, సూటిగా ఉంటే పలకడానికి సులభంగా ఉంటుంది. కానీ ప్రభుత్వ పరంగా చేయాలనుకున్న పనులు పథకాల గురించి కూడా అందరిచేతా చెప్పించారు. ప్రభుత్వం ఏం చేయాలో కూడా అందులోనే పొందుపరిచారు. తాము చేయాలనుకున్నవన్నీ జోడించి, పలకడానికి ఇబ్బందిపడే విధంగా తయారు చేశారు.
ముఖ్యమంత్రి ముందు దీక్షా సంకల్పం తీసుకున్నామని చెప్తే అయిపోతుందా? నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, పద్ధతి ప్రకారం పాలన సాగుతుంటే ప్రజలు కూడా అదే పద్ధతిని అనుసరిస్తారు. ఇందుకోసం ప్రతినబూనడం, పాఠాలు అప్పజెప్పడం అవసరం లేదు.
మహా సంకల్ప సభలో చంద్రబాబు ప్రసంగం మరీ సుదీర్ఘంగా సాగింది. రాష్ట్ర విభజన కష్టాలను మరోసారి ఏకరువు పెట్టారు. ఒకప్పుడు ఆంధ్రులు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. తర్వాత హైదరాబాద్ ను అభివృద్ధి చేద్దామనే సంకల్పంతో ఆంధ్రులు భాగ్యనగరానికి తరలివచ్చారన్నారు. ఇంటికొకరుగా హైదరాబాదుకు వచ్చి దీన్ని ఉద్ధరించారని మరోసారి ఉద్ఘాటించారు. హైదరాబాదును తాను ఎన్ని విధాలుగా బాగుచేశానో వివరించారు.
గతం ఎక్కువగా చెప్తూ, వర్తమానం గురించి తక్కువగా, భవిష్యత్తు గురించి మరీ తక్కువగా మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లయింది. విభజన ఎలా జరిగిందో, అప్పుడు ఏమేం జరిగిందో అందరికీ తెలుసు. చంద్రబాబు చెప్తేనే తెలుసుకునే స్థితిలో ప్రజలు లేరు. రెండేళ్ల క్రితం పుట్టిన శిశువులకు తప్ప, ప్రజలందరికీ వాస్తవాలు తెలుసు. అదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెప్పి బోర్ కొట్టిస్తున్నాననే ధ్యాస కూడా ఆయనకు ఉన్నట్టు లేదు.
ముఖ్యమంత్రి కాబట్టి ఏమీ అనలేక, ఎంతసేపు మాట్లాడినా వింటుంటారు. అంతమాత్రాన తన ప్రసంగం చాలా శ్రావ్యంగా ఉందనుకుంటే కష్టం. రెండేళ్ల తర్వాత కూడా బీదరుపులు అవసరమా? హైదరాబాదునే ఉద్ధరించిన వ్యక్తి, ఆంధ్ర ప్రదేశ్ ను ఉద్ధరించలేరా? రాజధాని నిర్మాణం, ఇతర విషయాల్లో కష్టపడుతున్న చంద్రబాబు, తన ప్రసంగాలతో జనానికి బోర్ కొట్టించడం మానితే బాగుండేదని బయటివాళ్లే కాదు, పార్టీలోని తమ్ముళ్లు కూడా కోరుకుంటున్నారు. నవ్యాంధ్ర నిర్మాతగా తనదైన ముద్ర వేసుకోవడానికి చంద్రబాబు శక్తివంచన లేకుండా శ్రమిస్తూనే, ప్రసంగాలతో విసిగించడం మానుకుంటారో లేదో చూద్దాం.