తిరుమల శ్రీవారిని ఎలాగోలా.. ఎప్పటికీ.. వివాదాస్పద అంశాలతో..వార్తల్లో ఉంచాలనుకుంటున్నట్లుగా.. ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు ధృవీకరిస్తున్నాయి. దీనికి సంబంధించి మంగళవారం హైకోర్టులో కూడా.. విచారణ జరగబోతోంది. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడాలంటూ… గుంటూరులో క్రిస్టియన్ మత సంస్థను నిర్వహిస్తూ.. స్వస్థత సభలను ఏర్పాటు చేసే…సైమన్ ఫౌండేషన్ అనే సంస్థ సీఈవో బోరుగడ్డ అనిల్ . భూపేంద్ర గోస్వామి అనే మరో గుజరాతీతో కలిసి హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ మంగళవారం జరగబోతోంది. ఈ పిల్ విచారణ అర్హమైనదో కాదో కోర్టు నిర్ణయిస్తుంది.
అసలు ఈ పిటిషన్లో చాలా వివాద్సపద అంశాలున్నాయి. తిరుమలను పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకురావాలనేది పిటిషన్ లో ఉన్న ప్రధాన అంశం. టీటీడీ ఆదాయ వ్యయాలు, ఆభరణాల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తును చేపట్టాలనేది మరో అంశం. తిరుమలలో నేలమాళిగలు, గుప్త నిధుల పరిరక్షణ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలనేది పిటిషన్ లోని మరో ముఖ్యాంశం. ఈ మూడు అంశాలపైనే కొద్ది రోజులు తిరుమల నేపధ్యంగా రాజకీయ దుమారం రేపింది. ఇప్పుడు అసలు తిరుమలకే సంబంధం లేని… క్రిస్టియన్ మతానికి చెందిన బోరుగడ్డ అనిల్, గుజరాత్ కు చెందిన భూపేంద్ర గోస్వామి.. సీన్లోకి వచ్చారు. అసలు వీళ్లే ఎందుకు తెరమీదకు వచ్చారో… త్వరలో తెలుస్తుంది.
ఈ బోరుగడ్డ అనిల్ .. కొద్ది రోజుల కిందట.. టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు… రమణదీక్షితులు ప్రెస్మీట్ లో యాక్టివ్ పార్ట్ తీసుకోవడం వివాదాస్పదమయింది. తిరుమలపై పిల్ వేసే విషయంలో రమణదీక్షితులు తనకు సహకరిస్తున్నారని.. అప్పుడే బోరుగడ్డ అనిల్ చెప్పుకొచ్చారు. ఈ బోరుగడ్డ అనిల్ క్రిస్టియన్ మత సంస్థ నిర్వాహకుడే కాకుండా.. రౌడి షీటర్ కూడా. వైఎస్ కుటుంబానికి దూరం బంధుత్వం కూడా ఉందని ప్రచారం. అసలు బోరుగడ్డ అనిల్ ఎవరో తనకు తెలియదని.. రమణదీక్షితులు ప్రకటించారు. సంబంధం లేని వ్యక్తిని చూపించి అప్రతిష్ట పాలు చేస్తున్నారని మండిపడ్డారు. దానిలో నిజనిజాలు బయటకు తెలియలేదు.
మంగళవారం హైకోర్టు పిల్ పై తీసుకునే నిర్ణయంపైనే.. తిరుమల శ్రీవారి కేంద్రంగా జరిగే రాజకీయాలపై ఓ క్లారిటీ రానుంది. వాస్తవానికి శ్రీవారిని ఏపీ కబంధ హస్తాల నుంచి విడిపిస్తానంటూ.. బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి చాలా రోజులుగా హడావుడి చేస్తున్నారు. వేసవి సెలవులు అయిపోగానే.. సుప్రీంలో పిటిషన్ వేస్తామన్నారు. కానీ ఇంత వరకూ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు కానీ… హైకోర్టులో మాత్రం పిల్ దాఖలయింది. ఇది కూడా ఓ వ్యూహమేమో..!