శాసనమండలి ఎపిసోడ్లో అతి పెద్ద జీరో మంత్రి బొత్స సత్యనారాయణ అని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. మండలి విషయాన్ని తాను డీల్ చేస్తానని.. బిల్లు పాస్ చేయించి తీసుకు వస్తానని.. పాస్ చేయించకపోయినా… రిజెక్ట్ చేసి అయినా..బిల్లును తీసుకువస్తామని..జగన్మోహన్ రెడ్డికి.. మంత్రి బొత్స సత్యనారాయణ గట్టి హామీ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. చివరికి ఈ ఎపిసోడ్లోఆయన పూర్తిగా విఫలమయ్యారు. దీంతో.. జగన్మోహన్ రెడ్డి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారని కూడా వైసీపీ ఆఫీసులో ప్రచారం జరుగుతోంది. ఈ ఫ్రస్ట్రేషనే.. బొత్సా సత్యనారాయణ రెండు రోజుల పాటు..అందరిపై చూపించారంటున్నారు. నిజానికి శాసనమండలి వ్యవహారాన్ని బొత్స.. మొదటి నుంచి చూసుకున్నారు. మండలి ఛైర్మన్ షరీఫ్‌పై తన రేంజ్‌కు తగ్గట్లుగా.. తన వ్యూహాలతో ఒత్తిడికి గురి చేశారు. అందు కోసం.. చాలా పనులే చేశారు. ఇక అంతా పనైపోయింది.
సెలక్ట్ కమిటీకి పంపకుండా.. నిర్ణయం జరిగిపోయిందని… బయటకు లీక్ చేశారు. మీడియా వర్గాలకూ అదే సమాచారం అందింది. సెలక్ట్ కమిటీకి బిల్లులను పంపకుండా.. ఓటింగ్ పెడతారని.. దాంతో.. మళ్లీ అసెంబ్లీకి వెళ్తుందని.. అక్కడ పని పూర్తయిపోతుందని.. ప్రభుత్వం అనుకుంది. శాసనమండలి చైర్మన్ కూడా.. తన నిర్ణయాన్ని దాదాపుగా అదే రీతిలో చదివారు. టీడీపీ సరైనసమయంలో నోటీసులు ఇవ్వలేదని.. అందులో ఉంది. కానీ.. చివరి వాక్యంలో మాత్రం… తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి.. సెలక్ట్ కమిటీకి పంపుతున్నట్లుగా చైర్మన్ ప్రకటించారు. ఈ వాక్యాన్ని ఊహించలేకపోయిన బొత్స సత్యనారాయణ బిత్తరపోయారు. తాను పని అయిపోయిందనుకుంటే… ఇలా తలకిందులు చేశారన్న ఉద్దేశంతోనే.. ఆయన షరీఫ్ పై ఊగిపోయారంటున్నారు. అనుచితమైన వ్యాఖ్యలు చేసి.. కంట్రోల్ తప్పిపోయారంటున్నారు.
రెండో రోజు కూడా.. ఆయన షరీఫ్ పై ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఎంత చేసినా.. బొత్స విఫలం కావడంతో..జగన్ వద్ద రిమార్కులు పడిపోయాయని.. ఈ దెబ్బతో.. బొత్స హర్టయ్యారని చెబుతున్నారు. ఆయనను నమ్ముకున్న జగన్ కూడా.. అసహనానికి గురయ్యారని.. ఇక ఆ తర్వాత నుంచి.. బొత్సకు రాజధాని అంశాలపై జరుగుతున్న సమావేశాలకు పిలుపు రావడం లేదని అంటున్నారు.