బొత్స సత్యనారాయణ.. ప్రెస్మీట్లు పెట్టి ఓ విషయం చెప్పడం.. దాన్ని ఖండించడానికి మరో ప్రెస్‌మీట్ పెట్టడం కామన్‌గా మారిపోయింది. ఎన్డీఏతో పొత్తు విషయంలో అవసరం అనుకుంటే కలుస్తామని సూటిగా చెప్పి.. తర్వాత తాను అలా అనలేదంటూ.. యూటర్న్ తీసుకున్న ఆయన.. తాజాగా.. చంద్రబాబు మాజీ పీఏ ఇంట్లో రూ. రెండు వేల కోట్లు దొరికాయని తాము చెప్పలేదని బుకాయించడం ప్రారంభించారు. కేవలం రూ. రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు, తరలింపులు మాత్రమే జరిగాయని.. తాము చెప్పామని కవర్ చేస్తున్నారు. టీడీపీ నేతలు పరువు నష్టం దావా వేస్తామంటున్నారని.. భయపడబోమని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా జరిగిన ఐటీ దాడుల్లో… ఏమేమి గుర్తించామో.. సీబీడీటీ ఓ పత్రాన్ని విడుదల చేసింది. అందులో ఓ ప్రముఖ వ్యక్తి మాజీ పీఏ అని ఉండటంతో.. వైసీపీ నేతలు రాజకీయ ఆరోపణల పండగ చేసుకున్నారు. అందులో చెప్పిన రెండు వేల కోట్లు చంద్రబాబువేనని.. అవన్నీ… ఆయన మాజీ పీఏ శ్రీనివాస్ ఇంట్లోనే పట్టుకున్నారని ఆరోపణలు గుప్పించారు. సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర్నుంచి ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యే వరకూ.. దీనిపై స్పందించారు. అందరూ చంద్రబాబు అవినీతి బయటపడిందని.. దానికి పట్టుబడిన ఆ రూ. రెండు వేల కోట్లే సాక్ష్యమన్నారు. అయితే.. శ్రీనివాస్ ఇంట్లో ఐటీ సోదాలపై పంచనామా వివరాలు వచ్చిన తర్వాత మాత్రం.. వైసీపీ కాస్త టోన్ తగ్గించారు. డబ్బులు పట్టుబడ్డాయని తాము చెప్పలేదని.. అంత సొమ్ము మళ్లించారని మాత్రమే చెప్పామంటున్నారు.
నిజానికి ఆస్తులు, కంపెనీలు, ఇతరత్రా.. అక్రమ ఆస్తులు ఏమైనా ఉన్నా… ఐటీ వర్గాలు.. కచ్చితంగా బయట పెట్టేవి. ఎంతెంత విలువ చేసిన ఆస్తులు గుర్తించామో.. ఏ ఏ ఆస్తుల పత్రాలు తీసుకెళ్తున్నామో.. ఆ పత్రాల్లో నమోదు చేసి.. సంబంధింత వ్యక్తి సంతకం తీసుకునేది. అలాంటివేమీ పత్రాల్లో లేవు. ఇప్పుడు.. రూ. రెండు వేల కోట్లు అని తాము అనలేదని.. బొత్స సత్యనారాయణ చెప్పడం ప్రారంభించారు. మొత్తానికి వైసీపీ నేతలు.. టీడీపీపై వేయాలనుకున్న రాజకీయ బురదను వేసేశారు. తీరిగ్గా… ఇప్పుడు.. తమ మాటలకు ఆ అర్థం లేదని.. బొత్స లాంటి వారు చెప్పడం ప్రారంభించారు.