మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ప్రజావేదిక నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చిన అధికారుల నుంచి … రూ. 8 కోట్లు వసూలు చేయబోతున్నట్లు ఆయన అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు. కరకట్టపై ఉన్న అక్రమ కట్టడాల తొలగింపుపై అసెంబ్లీలో అసువుగా మాట్లాడేసిన బొత్స చాలా కీలక ప్రకటనలు చేశారు. అందులో ప్రజావేదిక నిర్మాణానికి ఖర్చు చేసిన.. రూ. 8 కోట్ల వసూలు ప్రకటన కూడా ఉంది. నిజానికి.. ప్రజావేదిక అనేది ప్రభుత్వ నిర్మాణం … ఏదైనా అధికారుల స్థాయిలో.. పలు విభాగాల్లో ఆమోద ముద్రపడి.. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే.. పనులు ప్రారంభమయింది. ఈ క్రమంలో పలు శాఖల అధికారుల ప్రమేయం ఉంటుంది. ఇప్పుడు వారందరి నుంచి రూ. 8 కోట్లు వసూలు చేస్తానని మంత్రి బొత్స అసెంబ్లీ వేదికగా ప్రకటిచేశారు.
కూల్చివేతతో రూ. 8 కోట్ల ప్రజాధనం వృధా చేశారని విమర్శలను కాచుకోవడానికి.. బొత్స సత్యనారాయణ… అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే.. ఇంత వరకూ.. ఇలా.. ఓ ప్రభుత్వ వ్యవహారంలో.. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పరిహారాన్ని వసూలు చేసిన సందర్భం లేదు. అలాంటి పరిస్థితి వస్తే.. ప్రభుత్వంపై ఉద్యోగులు తిరగబడినా ఆశ్చర్యం ఉండదని.. రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సందర్భంలో.. ఉద్యోగుల నుంచి రూ. ఎనిమిది కోట్లు వసూలు చేస్తామని బొత్స చెప్పడం.. సహజంగానే ఉద్యోగులను ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు.. ఆ కట్టడం అక్రమ కట్టడమో కాదో.. నిర్ధారణ కాక ముందే.. కూల్చివేశారని.. అది నదీ గర్భానికి 130 మీటర్ల దూరంలోనే ఉందని చెబుతున్నారు.
వైఎస్ హయాంలో కరకట్టపై నిర్మాణలకు ఎందుకు అనుమతులిచ్చారని ప్రశ్నించారు. అప్పుడు చట్టాలు గుర్తుకు రాలేదా? ఇప్పుడే గుర్తుకు వచ్చాయా అంటూ టీడీపీ సభ్యులు బొత్సపై ప్రశ్నల వర్షం కురిపించారు. మరో వైపు.. ఇదే సందర్భంలో.. బొత్స.. చంద్రబాబుకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఆరు నూరైనా.. చంద్రబాబు ఉన్న ఇంటిని కూల్చితీరుతామని ప్రకటించారు. చంద్రబాబు ఇల్లు కూల్చివేత.. ఇతర ప్రకటనల సంగతేమో కానీ.. ఉద్యోగుల దగ్గర్నుంచి రూ. 8 కోట్లు వసూలు చేస్తామన్న బొత్స ప్రకటన మాత్రం.. హైలెట్ అవుతోంది. ప్రకటనకే పరిమితమవుతారా.. ముందడుగు వేస్తారా.. అన్న చర్చ కూడా ప్రారంభమయింది.