స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ గవర్నర్‌కు రాసిన కాన్ఫిడెన్షియల్ లేఖల విషయంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో నిమ్మగడ్డ రాసిన లేఖలు ఎలా అందాయో… బొత్స, పెద్దిరెడ్డి చెప్పాల్సి ఉంది. తన లేఖల లీకేజీపై సీబీఐ విచారణ కావాలని… నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టును కోరారు. వేగంగా విచారించి.. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వకపోతే.. తనకు అన్యాయం జరిగిపోతుందని ఆయన వాదించారు. లేఖలు గవర్నర్ కార్యాలయం నుంచి లీక్ కావడానికి మాత్రమే చాన్స్ ఉంది. అందుకే.. రాజ్ భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఆ లేఖల్ని ఆధారంగా చూపించి ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చిన బొత్స, పెద్దిరెడ్డిలను కూడా నిమ్మగడ్డ ప్రతివాదులుగా చేర్చారు.
మొత్తంగా రాజ్‌భవన్ మీదనే మరక పడే ప్రమాదం ఉండటంతో… తెర వెనుక దిద్దుబాటు చర్యలు జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో గవర్నర్ కార్యాలయం నుంచి లేఖలు లీకేజీ కాలేదని.. గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ తమకు తెలిపారన్న ఎస్ఈసీ తరఫు న్యాయవాది హైకోర్టుక ుసమాచారం ఇచ్చారు. దీంతో … మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలకు హైకోర్టు నోటీసులు చేసింది.. విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. గవర్నర్‌కు నిమ్మగడ్డ తాను రాసిన లేఖల గురించి తన కార్యాలయంలో కూడా ఎవరికి తెలియదని.. తనకు మాత్రమే తెలుసని.. కాబట్టి.. లీక్ అనే ఆప్షన్ గవర్నర్ కార్యాలయం వైపు నుంచే ఉందని ఆయన వాదిస్తున్నారు.
అనూహ్యంగా ఇప్పుడు తన వైపు నుంచి లీక్ కాలేదని గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారని ఎస్ఈసీ న్యాయవాది హైకోర్టుకు చెప్పడంతో ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం.. బొత్స, పెద్దిరెడ్డి చుట్టూ తిరగనుంది. ఆ లేఖల ఆధారంగానే నోటీసులు ఇచ్చినందున.. తమకు ఆ లేఖలు అందలేదని వారు చెప్పలేరు. అలా అని ఎక్కడి నుంచి వచ్చాయో కూడా చెప్పలేరు. వచ్చే మంగళవారం ఎస్ఈసీగా నిమ్మగడ్డ పదవీ కాలం ముగియడానికి ఒక్క రోజు ముందు. ఆ రోజు హైకోర్టు ఏ నిర్ణయం తీసుకోకపోతే.. ఈ ఇష్యూ కూడా మరుగునపడే అవకాశం ఉంది.