కౌలు కోసమే రాజధానికి భూములిచ్చిన రైతులు రోడ్డెక్కుతున్నారని.. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రాజధాని రైతుల్ని ఆయన అత్యంత హీనంగా చూస్తూ… వ్యాఖ్యలు చేస్తూండటంతో.. ఇదే మొదటి సారి కాదు. బొత్స ప్రకటనలపై..రాజధాని రైతులు రగిలిపోతున్నారు. కౌలు పది రోజుల్లో చెల్లిస్తామని.. బొత్స.. గొప్పగా ప్రకటిస్తూండటం… రైతుల్ని మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. అమరావతిపై.. వరుసగా వివాదాస్పద ప్రకటనలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న బొత్స.. రోజు రోజుకు వాటి డోస్ పెంచుకుంటూ పోతున్నారు. ఒకే సామాజికవర్గం వారిదన్నట్లుగా ప్రచారం చేయడం కూడా … రైతులకు నచ్చడం లేదు. రాజధానిలో మొత్తం 16 కులాలకు చెందిన వారు భూములిచ్చిన విషయాన్ని రైతులు గుర్తుచేస్తున్నారు. ఒకే సామాజికవర్గం వారు ఉన్నారని విష ప్రచారం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.
రాజధాని రైతుల ఆందోళనకు అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. ఆదివారం సీపీఐ నేతలు పర్యటించారు. సోమవారం రాజధాని రైతులు, కూలీలు ఏపీ బీజేపీ అధ్యక్షుడ్ని కలిశారు. మంగళవారం బీజేపీ నేతలు రాజధానిలో పర్యటించబోతున్నారు. 30, 31 తేదీల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. పార్టీల మద్దతు లభిస్తూ ఉండటంతో రైతులు ఆందోళనకు సమాయత్తమవుతున్నారు. రాజకీయ పార్టీల పర్యటనల తర్వాత రాజధానిపై ఉద్యమానికి రైతాంగం ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే రోడ్డెక్కటం ఖాయమని రాజధాని రైతులు చెబుతున్నారు.
బొత్స సత్యనారాయణ బెదిరింపు తరహాలో మాట్లాడుతూండటంతో.. వివాదం మరింత ముదురుతోంది. రాజధానిలో ఎవరెవరికి భూములున్నాయో సవాల్ చేస్తే నిరూపిస్తామని బొత్స వ్యాఖ్యానించారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పుకొచ్చారు. కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు తనకు సెంటు భూమిలేదని చెప్పారని… ఆయన సవాల్ చేస్తే.. ఆయనకు ఎంత భూమి ఉందో బయటపెడతామని బొత్స చెప్పుకొచ్చారు. నిజానికి సుజనా చౌదరి.. తనకు వారసత్వం వచ్చిన ఆస్తులు తప్ప… 2010 తర్వాత ఎప్పుడైనా భూములు కొనుగోళ్లు చేసినట్లు నిరూపిస్తే.. ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్ చేశారు. అయితే.. బొత్స.. సవాల్ చేస్తే చూపిస్తామని.. వ్యాఖ్యానించారు. నిజంగా ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఉంటే… మూడు నెలల కాలంలో… చిట్టా బయటకు రాకుండా ఉంటుందా..? అనేది చాలా మందికి అర్థం కాని విషయం.