అమరావతిపై.. అమరావతి రైతులపై మంత్రి బొత్స సత్యనారాయణ సందర్భం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తెరపైకి వస్తున్నారు. గత ఆరు నెలలుగా ఎక్కడా కనిపించని బొత్స సత్యనారాయణ .. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత పర్యటనకు సిమ్లాకు వెళ్లిన సమయంలో అమరావతిలో హల్ చల్ చేస్తున్నారు. అమరావతి రైతుల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిపై అనుమచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. వారు మరోసారి ర్యాలీలు, ధర్నాలు చేసేలా ఆయన బొత్స ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతి రైతులకు కుల ముద్ర వేశారు. వాళ్లతో చర్చించేదేంటి.. అని తీసి పడేశారు. ఈ వ్యాఖ్యలను కొన్ని మీడియా చానళ్లు హైలెట్ చేసి.. లేని పోని ప్రచారం కల్పించాయి.
నిజానికి బొత్స అన్న మాటల్లో కొత్తదనం ఏమీ లేదు. చాలా కాలంగా చెబుతున్నవే. అమరావతిపై వేయాల్సిన కులం ముద్ర ఎప్పుడో వేసేశారు. కొత్తగా ఏదో వేయాల్సిన పని లేదు. కానీ సందర్భం లేకుండా మరోసారి బొత్స అనడం.. ఆయనక మాటలకు కొన్ని టీవీ చానళ్లు లేనిపోని ప్రయారిటీ ఇవ్వడం ఏమిటన్నదే కొంత మంది వైసీపీ నేతలకు కూడా అంతుబట్టని విషయంగా మారింది. నిజంగా బొత్సను అలా మాట్లాడాలని ఎవరైనా చెప్పారా లేక సొంతంగా తనే చెప్పారా అన్నదానిపైనా స్పష్టత లేదు.
ముఖ్యమంత్రి జగన్ వ్యక్తిగత పర్యటనకు సిమ్లా వెళ్లారు. ఆయన మళ్లీ మంగళవారం వచ్చే అవకాశం ఉంది. ఈ లోపు రాష్ట్రంలో ఎలాంటి కీలకమైన ఘటనలు జరగకుండా చూసుకోవాల్సి ఉంది. అలాంటప్పుడు మొత్తం సైలెంట్‌గా ఉండాలి. కానీ బొత్స మాత్రం అమరావతి రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దీని వెనుక ఏదో గూడుపుఠాణి ఉందన్న అనుమానం కలిగేలా చేశారు. బొత్స వ్యవహారంపై వైసీపీలోనే రకరకాల చర్చలు ఉన్నాయి. ఆయన తరచూ ఢిల్లీకి వెళ్లివస్తున్నారన్న గుసగుసలూ వినిపిస్తూ ఉంటాయి. అందుకే బొత్స అసందర్భ ఆవేశం వెనుక ఏదో ఉందన్న అనుమానాలు వైసీపీలోనే ప్రారంభమయ్యాయి.