మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకోసారి రాజధాని అమరావతి అంశంపై స్పందించారు! అక్కడ ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందనీ, పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనీ, దానికి సంబంధించిన సమాచారం తమ దగ్గర ఉందన్నారు. రాజధాని ప్రాంతంలో తనకు సెంటు భూమి లేదని ఓ రాజస్యభ సభ్యుడు (సుజనా చౌదరిని ఉద్దేశించి) అన్నారనీ, ఆయనకు సంబంధించిన వివరాలు కూడా తమ దగ్గర ఉన్నాయన్నారు. ఆయన సవాలు చేస్తే… వెంటనే భూముల్ని చూపిస్తామని బొత్స అన్నారు! ఎవరో విమర్శలు చేస్తున్నారని ఆ సమాచారాన్ని ఇప్పుడు ఎందుకు బయటపెట్టాలీ అని ఉల్టా ప్రశ్నించారు? ప్రభుత్వం దగ్గర అన్ని రకాల సమాచారమూ ఉందనీ, లేకుంటే ఇలా ఎలా మాట్లాడతామని బొత్స అన్నారు.
నాలుగు రాజధానులు అంటూ వినిపిస్తోంది కదా అని విలేకర్లు అడిగితే… ఆ వ్యాఖ్య చేసినవారినే అడగండని బొత్స అన్నారు. ఓ భాజాపా నేతతో సీఎం జగన్మోహన్ రెడ్డే ఈ ప్రతిపాదన తీసుకొచ్చారని చెబుతున్నారంటే… ఆ భాజపా నేత ఎవరో వారినే అడగండి అంటూ బొత్స సూచించారు! రాజధాని భూముల్లో అక్రమాలంటున్నారు కదా… ఆ వివరాలు బయటపెట్టొచ్చు కదా అని మీడియా అడిగితే, మీరు అడిగితే ఎలా చూపిస్తాను, ఆ వ్యక్తులు అడిగితే సమాధానం చెప్తాను కదా అన్నారు. సరైన సమయంలో భూకబ్జాల వివరాలు బయటకి వస్తాయన్నారు. అమరావతిలో అక్రమాలు జరిగాయని గతంలో భాజపా నాయకులు కూడా ఆరోపించారనీ, అవినీతిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా విమర్శలు చేశారు అన్నారు. కానీ, ఇప్పుడాయన మాట మార్చుతున్నారన్నారు.
రాజధాని తేనెతుట్టెని కదిపిందే మంత్రి బొత్స. అమరావతిలోనే ఉంటుందా మార్చేస్తారా అనే చర్చకు కారణం ఆయన వ్యాఖ్యలే. అమరావతిపై ఇప్పుడు ప్రభుత్వం చర్చిస్తోందని నేటితో మూడోసారి కూడా ఆయనే చెప్పారు. ఇలాంటప్పుడు, అవినీతికి సంబంధించిన సమాచారం ఉంటే బయటపెట్టడానికి ఇంతకంటే సరైన సమయం ఇంకేం కావాలి..? అవసరమొచ్చినప్పుడు అంటే… ఏ అవసరం, ఎవరికి అవసరం..? ఇంకోటి.. అమరావతిలో భూములు తనకు లేవని సుజనా చౌదరి అంటున్నారనీ, ఉంటే నిరూపించాలని ఆయనే ప్రభుత్వాన్ని సవాల్ చేస్తే అప్పుడు అసలు విషయాలు చెప్తామని బొత్స అంటున్నారు. అంటే, ప్రభుత్వాన్ని ఎవరో నాయకులు సవాలు చేస్తే తప్ప.. వివరాలేవీ బయటపెట్టరా..? ప్రజల్లో ఇప్పుడు జరుగుతున్న చర్చకు జవాబుదారీతనం ఏది..? దాన్ని నివృత్తి చెయ్యాల్సిన బాధ్యత… ఆయన భాషలో చెప్పాలంటే బాధ్యతాయుతమైన మంత్రిగా లేదా..?