ప్రభుత్వం మారి రెండు నెలలు దాటిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటూ.. తీవ్రమైన ఆరోపణలు చేసింది. అమరావతిలో చుట్టు పక్కల.. అదీ సీఆర్డీఏ పరిధిలో.. టీడీపీ నేతలు.. 30వేల ఎకరాలు కొనుగోలు చేశారని సాక్షి పత్రికలో.. పుంఖానుపుంఖాలుగా కథనాలు రాశారు. ఇప్పుడు… అధికారంలోకి వచ్చాక.. వాటికి సంబంధించిన సాక్ష్యాలను మాత్రం ఇంకా బయటపెట్టలేదు. కానీ ఆరోపణలు మాత్రం కొనసాగిస్తున్నారు. పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ కూడా.. రెండు నెలల నుంచి అమరావతి మొత్తం స్కామే అంటున్నారు కానీ… అసలు.. ఏం స్కాం జరిగిందో.. ఒక్కటీ వివరం వెల్లడించలేదు. అయితే.. ఆదివారం మీడియాతో మాట్లాడిన బొత్స…ఓ సంచలనాత్మక విషయం వెల్లడించారు.
బాలకృష్ణ, ఆయన వియ్యంకుడు కలిసి.. సీఆర్డీఏ పరిధిలో ఐదువందల ఎకరాలు కొనుగోలు చేశారట. ఆ ఐదు వందల ఎకరాలు.. బాలకృష్ణ ఎలా కొనుగోలు చేశారు..? జీవోలు ఎలా ఇచ్చారు…? అసలు ఎలా సాధ్యమయిందో నిగ్గు తేలుస్తామని ప్రకటించారు. నిజానికి ఇది వైసీపీ తరపు నుంచి వచ్చిన అనూహ్యమైన ఆరోపణ. బొత్స.. ఈ ఆరోపణ చేయక ముందే.. ఓ ఇంగ్లిష్ పత్రికలో.. క్వశ్చన్ మార్క్ పెట్టి… సీఆర్డీఏ పరిధిలో బాలకృష్ణకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయనే కథనాన్ని ప్రచురించారు. మంత్రి హోదాలో అదీ కూడా… సీఆర్డీఏకు మంత్రిగా ఉన్న.. బొత్స .. అసలు డాక్యుమెంట్లను బయట పెట్టకుండా… ఇంగ్లిష్ పత్రికలో వచ్చిన కథనాన్నే ఆరోపణల రూపంలో చెప్పారు. నిజానికి బాలకృష్ణకు.. కానీ.. ఆయన బంధువులకు కాని అక్కడ భూములు ఉంటే.. మంత్రిగా.. బొత్స డాక్యుమెంట్లు బయట పెట్టడం క్షణాల్లో పని. కానీ బొత్స ఆ పని చేయలేదు. నోటి మాట ద్వారానే చెప్పారు.
అదే సమయంలో… నారా లోకేష్.. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తండ్రి ఎన్టీఆర్.. సీఎంగా ఉన్నప్పుడు కూడా.. బాలకృష్ణ.. కనీసం సెక్రటేరియట్ వైపు కూడా చూడలేదని గుర్తు చేశారు. నీతి నిజాయితీలతో ఉండే బాలకృష్ణపై నిందలేస్తున్నారని.. నిరూపించకపోతే… ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరి అధికారపక్షం… ఇప్పటికీ… ఆరోపణలకే పరిమితమవుతుందో… బొత్స ఆధారాలతో మీడియా ముందుకు వస్తారో చూడాలి.. !