వారసులు తెరపై ఎంట్రీ ఇస్తున్నారంటే… వెనుక ఉన్న ఫ్యామిలీకి బోల్డంత టెన్షన్. ఎలాగైనా సరే, ఎంతైనా సరే.. తమ పలుకుబడిని ఉపయోగించి కావల్సినంత పబ్లిసిటీ తెచ్చుకోవాలని చూస్తుంటారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా అదే చేస్తున్నారు. బండ్ల గణేష్ బొత్సకి బినామీ అని… గణేష్ తీసిన సినిమాలన్నింటికీ బొత్స డబ్బులు పెట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటిపై ఇంకా క్లారిటీ లేకపోయినా… ఇప్పుడు బొత్స మాత్రం తన అల్లుడి తమ్ముడి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్.
‘జువ్వ’ అనే ఓ చిన్న సినిమా ఈ వారం విడుదల కాబోతోంది. రంజిత్ అనే కొత్త కుర్రాడు ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. పేరుకి చిన్న సినిమా అయినా ప్రమోషన్లు భారీగానే చేస్తున్నారు. టీవీల్లో చూస్తుంటే.. ‘జువ్వ’ చెలరేగిపోతోంది. అన్ని యాడ్లు పడుతున్నాయి. దీన్నంటికీ కారణం బొత్స చూపిస్తున్న ఉత్సాహమే. అల్లుడు తమ్ముడంటే… అల్లుడి కిందే లెక్క. అల్లుడు కోసం వాళ్ల తమ్ముడ్ని ప్రమోట్ చేసే బాధ్యత బొత్స తీసుకున్నట్టు సమాచారం. టీవీ ఛానళ్లన్నింటితోనూ బొత్సకు సత్సంబంధాలే ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని, దాదాపు అన్ని ప్రముఖ టీవీ ఛానళ్ల యజమానులకూ బొత్స ఫోన్లు చేస్తున్నార్ట. ‘మా సినిమా ఇది.. కాస్త బాగా ప్రమోట్ చేయండి’ అంటూ పర్సనల్గా అభ్యర్థిస్తున్నాడట. ‘జువ్వ’ కోసం తెర వెనుక డబ్బులు పెట్టింది కూడా బొత్స కుటుంబమే అని టాక్. చూద్దాం… బొత్స ప్రయత్నాలు ఏమేరకు సఫలీకృతం అవుతాయో.