కేంద్ర ప్రభుత్వంలో చేరే విషయంపై చర్చించడానికే.. జగన్మోహన్ రెడ్డి.. మోడీ, అమిత్ షాలతో భేటీ అవుతున్నారన్న ప్రచారం ఓ వైపు ఉధృతంగా సాగుతూండగానే.. మరో వైపు ఏపీ నుంచి .. అలాంటి సంకేతాలను… వైసీపీ నేతలు ఇవ్వడం ప్రారంభించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం.. ఏమైనా చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కేంద్ర మంత్రివర్గంలో వైకాపా చేరాలనే ప్రతిపాదన వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని.. దీనికోసం ఎవరి గెడ్డమైనా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. కేంద్రంతో ఎందుకు ఘర్షణ పడాలని మీడియా ప్రతినిధులను బొత్స ఎదురు ప్రశ్నించారు.
బీజేపీతో దగ్గరగా..దూరంగా లేమని వ్యాఖ్యానించారు. బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు.. ఇంత వరకూ అంతర్గతంగా జరుగుతున్న రాజకీయ ప్రచారానికి ఊతమిచ్చేలా ఉన్నాయి. కేంద్ర కేబినెట్లో చేరాలని వైసీపీని.. బీజేపీ ఆహ్వానించిందని.. ఆ మేరకు ఆమోదం తెలియచేయడానికే.. జగన్ ఢిల్లీ పర్యటనలకు వెళ్లారని చెబుతున్నారు. బడ్జెట్ రెండో విడత సమావేశాలు ప్రారంభమయ్యేలోపు… మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు బొత్స.. రాష్ట్ర ప్రయోజనాల కార్డును ప్రయోగించడం కూడా ఇందుకేనంటున్నారు. గతంలో టీడీపీ కూడా.. బీజేపీతో పొత్తును రాష్ట్ర ప్రయోజనాలతో ముడి పెట్టింది.
ఒక్క రూపాయి అదనంగా తీసుకురాలేకపోయింది. వైసీపీ బీజేపీకి అనధికార మిత్రపక్షంగా ఉంటున్నప్పటికీ.. కనీసం పోలవరం బకాయిలు కూడా రప్పించుకోలేకపోయింది. ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో చేరేందుకు సిద్ధమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వైసీపీలో బొత్స అయినా ఎవరైనా కీలకమైన అంశాలపై… ఎలాంటి సంకేతాలు రాకుండా మాట్లాడరు. ఇప్పుడు పై నుంచి వచ్చిన ఆదేశాలతోనే బొత్స హింట్ ఇచ్చారని భావిస్తున్నారు.