రోడ్డు విస్తరణ పరిహారం కావాలా..? చంద్రబాబును అడగండి.. పొండి..!. .. ఈ మాటలన్నది సాక్షాత్తూ… ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ. ఆయన మంత్రి పదవిలో ఉండి… ప్రతిపక్ష నేతను.. అడగమని .. బాధితులు, నిర్వాసితులకు నిర్మోహమాటంగా చెప్పడం కలకలం రేపుతోంది. కర్నూలు జిల్లా నంద్యాలలో పర్యటించిన బొత్స సత్యనారాయణను.. అక్కడ అభివృద్ధి పనుల్లో… ఆస్తులు కోల్పోయిన వారు వచ్చి పరిహారం కోసం డిమాండ్ చేశారు. చట్ట ప్రకారం.. ఇవ్వాల్సిన పరిహారాన్ని వీలైనంత త్వరగా ఇప్పిస్తామని చెప్పాల్సిన మంత్రి అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు. చంద్రబాబును అడగాలని చెప్పి కసురుకున్నారు. నంద్యాలలో అభివృద్ధి పనులు చంద్రబాబు హయాంలో ప్రారంభమయ్యాయి.
అందుకే బొత్స.. ఆ తరహా వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై బాధితుల్లోనే కాదు.. ఇతర నేతల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయి. ఆ తర్వాత ప్రజలందరి బాగోగులు చూడాల్సింది ప్రభుత్వమే. అయితే ప్రస్తుత ప్రభుత్వం.. తాము.. వచ్చినప్పటి నుంచి చేసే పనులు మాత్రమే చేస్తామన్నట్లుగా వ్యహరిస్తోంది. గత ప్రభుత్వం.. చంద్రబాబు వ్యక్తిగత వ్యవహారాలన్నట్లుగా.. లైట్ తీసుకుంటోంది. ప్రజలను కూడా.. పార్టీల వారీగా విభజించి పరిపాలిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి రోడ్డు విస్తరణ పనులు.. నిర్వాసితులకు నిధులు.. ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు జరిగే కొద్దీ విడతల వారీగా చెల్లిస్తోంది. మిగిలి ఉన్న వాటిని ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసింది.
ఓ సీనియర్ మంత్రిగా ఉండి.. బొత్స సత్యనారాయణ .. రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ పరంగా చేయాల్సిన పనులను.. ఇవ్వాల్సిన పరిహారాలను చంద్రబాబును అడగమంటే… ఇక ప్రభుత్వంలో మీరెందుకు అన్న ప్రశ్న సహజంగానే ప్రజల వద్ద నుంచి వస్తుంది. మరి దీనికి బొత్స ఏమని సమాధానం చెబుతారో..?