తెలంగాణ విద్యా వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బొత్సపై తెలంగాణ మంత్రులు మండిపడ్డారు. అయితే వారిపై మాట్లాడటానికి బొత్స ఇష్టపడటంలేదు. రెండు రోజుల్లో స్పందిస్తానంటూ చెప్పుకొచ్చారు. ఆయన మాటలు విని… డైవర్షన్ గేమ్ అట్టర్ ఫ్లాప్ అయిందని అందుకే ఆయనకు స్క్రిప్ట్ హెడ్డాఫీస్ నుంచి పంపడం లేదన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.
బొత్స సత్యనారాయణ గతంలో అనవసరంగా కల్పించుకుని మరీ తెలంగాణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కానీ సమయం , సందర్భం లేకపోయినా పరీక్షల నిర్వహణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వెంటనే.. ఘాటు కౌంటర్లు.. ఏపీ రాజధాని ప్రస్తావన చేసి మరీ.. తెలంగాణ మంత్రులు ఇచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. చివరికి బొత్స కూడా ఎలా స్పందించాలో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పలేదన్నట్లుగా.. రెండు రోజుల తర్వాత స్పందిస్తానని కవర్ చేసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సయోధ్య ఉంది. ఇటీవలి కాలంలో ఇద్దరు ముఖ్యమంత్రులు నేరుగా కలవకపోయినప్పటికీ పరస్పర రాజకీయ ప్రయోజనాల విషయంలో సహకారం బహిరంగంగానే కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజనకు సంబంధించిన పలు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు ఇప్పటి వరకు పరిష్కారం లభించలేదు. గతంలో బేసిన్లు, భేషజాలు లేవని.. సమస్యలను పరిష్కరించుకుంటామని కేసీఆర్ విజయవాడలో చెప్పారు. కానీ ఎలాంటి సమస్యలు పరిష్కరించుకోకపోగా.. రెండు రాష్ట్రాలు విభజన సమస్యల్ని కేంద్రానికి, కోర్టులకు వదిలేశారు.
కానీ అవసరమైనప్పుడు ఇలా డైవర్షన్ రాజకీయాల కోసం తిట్టుకునేందుకు మీడియా ముందుకు వస్తారు. వీరి రాజకీయంపై ప్రజలకు ఓ అభిప్రాయం ఏర్పడిందేమో కానీ.. ప్రజలు కూడా… పట్టించుకోవడం మానేశారు.