బొబ్బిలి వైకాపా ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీ నాయిన పార్టీని వీడి త్వరలో తెదేపాలో చేరబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి తమ అభ్యంతరాలను ఖాతరు చేయకుండా బొత్స సత్యనారాయణని పార్టీలోకి తీసుకొన్నప్పటి నుంచి వారిరువురు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. తెదేపా వారిని పార్టీలోకి ఆహ్వానించడంతో ఆ అవకాశాన్ని వినియోగించుకొని వారు పార్టీ వీడి వెళ్ళిపోతున్నారు. వారికి తెదేపా ఏమైనా ఆఫర్ ఇచ్చిందో లేదో తెలియదు కానీ బొత్స సత్యనారాయణ కారణంగానే వారు పార్టీని వీడి వెళ్లిపోతున్నారని చెప్పకతప్పదు.
ఒకప్పుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు విజయనగరం జిల్లాలో మకుటంలేని మహారాజులా ఒక వెలుగు వెలిగారు. ఆ తరువాత ఏర్పడిన రాజకీయ పరిణామాల గురించి అందరికీ తెలుసు. వైకాపాలో చేరిన తరువాత బొత్స మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అయినప్పటికీ, జిల్లాలో బొబ్బిలి రాజుల ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నందున ఇదివరకులాగా అయన చక్రం తిప్పలేకపోతున్నారు. ఒకవేళ ధైర్యం చేసి జిల్లా రాజకీయాలలో వేలు పెడితే పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోతామని వారు గట్టిగా హెచ్చరిస్తుండటంతో ఆయన స్వంత జిల్లా రాజకీయాలకే దూరంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ఏ రాజకీయ నాయకుడు కూడా తనకి పట్టున్న స్వంత జిల్లా రాజకీయాలకి దూరంగా ఉండాలని కోరుకోడు. కోరుకొంటే అది రాజకీయ ఆత్మహత్యే అవుతుంది. కానీ ఇంతకాలం జగన్ అనుమతించకపోవడం వలన బొత్స సత్యనారాయణ జిల్లా రాజకీయాలకి దూరంగా ఉండవలసి వచ్చింది. కానీ ఇప్పుడు తనను వ్యతిరేకిస్తున్న, తనకి అడ్డంగా ఉన్న బొబ్బిలి రాజులిద్దరూ వారంతట వారే పార్టీని వీడి వెళ్లిపోతుండటంతో బొత్స సత్యనారాయణ లోలోన చాలా సంతోషిస్తుండవచ్చు. అంతే కాదు ఇప్పుడు జిల్లాలో పార్టీని కాపాడే బాధ్యత జగన్మోహన్ రెడ్డి స్వయంగా అప్పగించారు. బొత్స సత్యనారాయణ కోరుకొంటున్నది కూడా అదే కనుక ఆయన చాలా సంతోషంగా ఆ బాధ్యత స్వీకరించి వెంటనే రంగంలోకి దిగారు.
బొబ్బిలి రాజులతో బాటు జిల్లాలోని వైకాపా పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా పార్టీ విడిచి వెళ్లిపోకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మూడేళ్ళ క్రితం తనపై కోపంతో పార్టీ విడిచి వెళ్లిపోయిన మాజీ ఎమ్మెల్యే శంబంగి చిన్న అప్పలనాయుడు ఇంటికి బొత్స సత్యనారాయణ స్వయంగా వెళ్లి పార్టీలోకి రమ్మని ఆహ్వానించడంతో అటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న ఆయన అందుకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. జిల్లాలోని పార్టీ కార్యకర్తలు, ఇతర నేతలతోను బొత్స సత్యనారాయణ వరుసగా సమావేశం అవుతున్నారు. బొబ్బిలి రాజులతో బాటు ఎవరూ పార్టీ వీడి వెళ్ళకుండా ఆపగలిగినట్లయితే, బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా రాజకీయాలపై మళ్ళీ తన పట్టు కొనసాగించవచ్చు. మళ్ళీ ఇన్నాళకు విజయనగరం జిల్లా రాజకీయాలు బొత్స సత్యనారాయణ చేతిలోకి వచ్చేయి. అందుకు బొబ్బిలి రాజులకి థాంక్స్!