ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి మూడు రాజధానుల నిర్ణయం కూడా ఓ కారణమని ఫలితాలతో ప్రస్ఫుటమైంది. అయినా ఈ విషయాన్ని అంగీకరించేందుకు వైసీపీకి మనసొప్పడం లేదు. ప్రజలు తిరస్కరించిన మూడు రాజధానులకే ఇంకా కట్టుబడి ఉన్నామంటూ తాజాగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది.
మూడు రాజధానులపై బొత్స చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమో, పార్టీ విధానమో కానీ వైసీపీకి ఇంకా బుద్ది రాలేదని ప్రజల్లో చర్చ జరుగుతోంది. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామని వైసీపీ హామీ ఇచ్చినా ఉత్తరాంధ్రలో వైసీపీని ఆదరించలేదంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవాల్సింది. కానీ, ఈ విషయంలో వెనక్కి తగ్గేందుకు అహం అడ్దోస్తుందో మరేమిటో కానీ, ఇంకా మూడు రాజధానుల పల్లవిని వినిపిస్తుండటం చర్చనీయాంశం అవుతోంది.
వైసీపీ తీసుకున్న నిర్ణయాలే ఆ పార్టీని ప్రతిపక్ష హోదాకు సైతం దూరం చేశాయి. మూడు రాజధానుల పేరుతో హడావిడి చేసి ఏపీకి రాజధాని లేకుండా చేయడం వైసీపీపై ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపిందనేది ఓపెన్ సీక్రెట్. ఓటమి తర్వాత ఎందుకీ ఫలితాలు వచ్చాయని విశ్లేషించుకుంటే ఈ విషయం అర్థమై ఉండేదేమో. ఒకవేళ ఈ విషయం అర్థమైనా ఇంకా అహంకారం దోస్తీ చేస్తుండటమే ఈ వ్యాఖ్యలకు కారణమై ఉండొచ్చునని అంటున్నారు.
ఇప్పటికీ వైసీపీ మారకపోతే వచ్చే ఎన్నికల నాటికి 11 సీట్ల నుంచి జీరో నెంబర్ కు చేరుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.