రాజధాని అమరావతి మీద మంత్రి బొత్స సత్యనారాయణ ఆ మధ్య సృష్టించిన గందరగోళం తెలిసిందే! మారుస్తామని ఓసారి, ముంపు ప్రాంతంలో రాజధానేంటీ అని మరోసారి, అబ్బే ఆ ఉద్దేశం లేదని ఇంకోసారి చేసిన వ్యాఖ్యలపై చాలా చర్చే జరిగింది. అయితే, చివరికి అదేం ఉండదనే అభిప్రాయమే వ్యక్తమైంది. అంతేకాదు, నవంబర్ 1 నుంచి అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణ పనులను పునః ప్రారంభించే అవకాశం ఉందనే కథనాలూ ఇవాళ్లే వచ్చాయి. నిలిచిపోయిన భవనాలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గతవారం సందర్శించారు, నిలిచిపోయిన పనులు ప్రారంభించాలని కాంట్రాక్టర్లను కోరాలని కూడా అనుకున్నారు. ఇవన్నీ చూస్తే… అమరావతి విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి రెండో ఉద్దేశం లేదన్నది దాదాపు సుస్పష్టం అనిపించింది. కానీ, రాజధాని ప్రాంతంపై గందరగోళాన్ని ఇంకా కొనసాగుతుంది అన్నట్టుగా మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి మాట్లాడారు.
రాజధానిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తుందన్నారు మంత్రి బొత్స. రాజధాని ఎలా ఉండాలనీ, ఎక్కడ ఉండాలనేది ఆ కమిటీ నిర్ణయిస్తుందని ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. ఏ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చెయ్యాలనేది కూడా కమిటీ చెబుతుందన్నారు. నిపుణుల సూచనలు తీసుకున్నాక, ప్రజాభిప్రాయాన్ని కూడా తెలుసుకుంటామనీ, ఆ తరువాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అన్నారు! అయితే, గత టీడీపీ హయాంలో అప్పటి మంత్రి నారాయణ నేతృత్వంలో కమిటీ రాజధానిపై ఇలానే అధ్యయనం చేసి, ఒక ప్రాంతాన్ని నిర్ణయించింది కదా అని బొత్సని అడిగితే… నేను నారాయణని కాదు, సత్యనారాయణని అంటూ సమాధానమిచ్చారు! నారాయణ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రికి చెప్పారనీ, కానీ మేం ప్రజల నిర్ణయాన్ని ముఖ్యమంత్రికి చెబుతామని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
రాష్ట్రవ్యాప్తంగా పరిశీలించాకనే కదా అమరావతిని రాజధానిగా గత ప్రభుత్వం ఎంపిక చేసింది. జరగాల్సిన కసరత్తు అప్పుడే జరిగింది. రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండాలనీ, అన్ని ప్రాంతాలకూ అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతోపాటు, అమరావతికి ఉన్న చారిత్రక నేపథ్యాన్ని కూడా గత ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేసింది. అయితే, ఇప్పుడు మంత్రి బొత్స చెబుతున్నట్టుగా… ప్రభుత్వం వేసిన కమిటీ ఏం చెబుతుందో చూడాలి.