” రాజధానిపై అప్పట్లో జగన్ చేసిన ప్రకటనను సరిగా అర్థం చేసుకోవాలి. జగన్ మాట్లాడిన భాషను అర్థం చేసుకుంటే, అప్పుడు ఎవరికైనా స్పష్టత వస్తుంది..” ఇది బొత్స సత్యనారాయణ.. తనదైన భాషలో మీడియాకు చెప్పిన సుద్దు. ఏ సందర్భంలో అంటే.. రాజధానికి కనీసం 30వేల ఎకరాలు ఉండేలా చూసుకోవాలని..,జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తూ అసెంబ్లీలో చెప్పారు. ఇదే విషయాన్ని మీడియా బొత్సను ప్రశ్నించింది. జగన్ అప్పట్లో అలా అన్నారు.. ఇప్పుడేంటి.. ఇలా చేస్తున్నారన్న వస్తున్న విమర్శలకు.. బొత్స.. భాషా పరమైన పరిష్కారం వెదుక్కున్నారు. జగన్ లాంగ్వేజ్ వేరని.. దాన్ని అర్థం చేసుకోవాలంటే.. తనలాంటి పండితులకై సాధ్యమవుతందన్నట్లుగా వివరణ ఇచ్చారు. జగన్.. 30వేల ఎకరాలు కావాలన్నారు.. అంటే.. దానర్థం.. ప్రభుత్వ భూమి 30వేల ఎకరాలు ఉండాలని అట.
ఆ విధంగా.. జగన్ భాష అర్థం చేసుకుంటే.. అందరికీ క్లారిటీ వచ్చేస్తుందని బొత్స చెప్పుకొచ్చారు. గతంలోఅమరావతిని సమర్థిస్తూ అసెంబ్లీలో చేసిన తీర్మానం.. ఎంత చేసినా చెరిగిపోనిది. అలాగే.. జగన్ 30వేల ఎకారాలు ఉండేలా చూసుకోనాలని చంద్రబాబుకు ఇచ్చిన సలహా కూడా.. చరిత్రలో నిలిచిపోతుంది. దానికి ఇప్పుడు ప్రభుత్వ భూమి అంటూ… కొత్త కథలు చెబుతున్నా బొత్స సత్యనారాయణ. నిజానికి ఇప్పుడు.., అమరావతిలో రైతులు ప్రభుత్వానికి భూమి ఇచ్చేశారు. ప్రభుత్వ అధీనంలోనే భూమి ఉంది. అదంతా ప్రభుత్వ భూమి కిందే వస్తుంది. ఆ విషయాన్ని బొత్స గుర్తించలేకపోతున్నారు. నిజానికి.. ప్రభుత్వానికి ప్రత్యేకంగా భూమి ఎప్పుడూ ఉండదు. ఏదైనా అవసరం కోసం రైతుల నుంచి సేకరించాల్సిందే.
గతంలో.. గరిష్ట భూపరిమితి చట్టం.. ఇతర చట్టాల కారణంగా ప్రభుత్వానికి దాఖలు పడిన భూములు కొన్ని అయితే.. వివిధ అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల దగ్గర్నుంచి సేకరించిన భూములు మరికొన్ని ప్రభుత్వం వద్ద ఉంటాయి. ఇవి కాకుండా అటవీ భూమి ప్రభుత్వం పేరు మీద ఉంటుంది కానీ.. దాన్ని అడవుల్లాగే ఉంచాలి.. ఇతర అవసరాలకు వాడకూడదు. ఈ విషయాలన్నీ మంత్రిగా ఉన్న బొత్సకు తెలియక కాదు. కానీ.. జగన్మోహన్ రెడ్డి గతంలో అమరావతిని సమర్థించిన విషయాన్ని.. ఇప్పుడు సమర్థించుకోలేక పడుతున్న తంటాలు అవి.