వచ్చే ఉగాది తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన ఉంటే తాను గుండు చేయించుకుంటానని వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ చాలెంజ్ చేశారు. విశాఖలో ఓ వైసీపీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఆ పార్టీలకు లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆ పార్టీలకు స్కీములు గుర్తుకు వస్తాయని విమర్శించారు. కొంతమంది నేతలు మాట్లాడితే చేతులు, కాళ్లు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పుతో కొడతామని విపక్షాలు చేస్తోన్న వ్యాఖ్యలపై స్పందిస్తూ… చెప్పులు ఎవరికి ఉండవు.. అందరికీ ఉంటాయన్నారు. కానీ ఆ నేతలు ఊరికనే కాళ్లు, చెప్పులు చూపించరు కదా.. తాము ఏం చేశామన్న సంగతిని కూడా బొత్స చూసుకోవాలి కదా.. కానీ ఆయన మాత్రం.. తన రాజకీయ పంథాలో అర్థం కాని భాషలో చాలెంజ్ చేసేశారు.
నీ విధానం ఏమిటి, పార్టీ ఏమిటి అంటే జనసేనాని వద్ద సమాధానం లేదన్నారు. రాజకీయ దుకాణం తెరిచి పదిహేనేళ్లయిందని ఎద్దేవా చేశారు. వాలంటీర్లపై కూడా మాట మార్చారన్నారు. అసలు నువ్వు ఎవరు.. నీ స్టాండ్? ఏమిటో చెప్పాలన్నారు. ఈ రాజకీయాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం, రాజకీయాలు అంటేనే అసహ్యమేస్తోందని.. చెప్పుకొచ్చారు. బొత్స సత్యనారాయణ చేసిన విమర్శల సంగతేమో కానీ.. ఆయన చేసిన గుండు చాలెంజ్ మాత్రం వైరల్ అవుతోంది. ఇదేదో ఆఫ్ ది రికార్డు అన్న మాట కూడా కాదు కాబట్టి.. ఆ వీడియోను వచ్చే ఉగాది తర్వాత కూడా తిప్పుతారు. అందుకే.. ఆయన రెడీగా ఉండాలన్న సెటైర్లు పడుతున్నాయి.
రాజకీయ నేతలు ఇలాంటి చాలెంజ్ లు చేస్తూ ఉంటారు. అంతా అయిపోయాక.. ఎదుటి వారు స్వీకరించలేదని సర్దుకుంటారు. కానీ ఇక్కడ బొత్స..తనకు తానే సవాల్ చేసుకున్నారు. స్వీకరించడం అనే ప్రశ్నే లేదు. గతంలో వైఎస్ .. ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ చేయలేదు. తర్వాత గ్రేటర్ ఎన్నికలప్పుడు టీఆర్ఎస్ వందసీట్లు గెల్చుకుంటే చెవి కోసుకుంటానని సీపీఐ నారాయణ ప్రకటించారు. కానీ ఆయనా కోసుకోలేదు.. అంతకు మించి బొత్సకు ఒకప్పుడు బినామీగా పేరుపొందిన బండ్ల గణేష్ కూడా.. బ్లేడ్ చాలెంజ్ చేసి.. తర్వాత పరువు పోగొట్టుకున్నారు. ఇప్పుడు బొత్స కూడా అదే లైన్లోకి వచ్చారు.