అన్న క్యాంటీన్లను రద్దు చేసే ఉద్దేశం లేదని.. అసెంబ్లీలో చెప్పిన పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ… అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన తర్వాత మాత్రం.. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్‌గా మాట్లాడుతూ.. ఆగస్టు ఒకటో తేదీ నుంచే వాటిని మూసేస్తున్నట్లుగా ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో… ఎన్నికలకు ఆరేడు నెలల ముందు ప్రారంభించిన ఈ క్యాంటీన్లు.. పేదల కడుపు నింపాయి. మూడు పూటలా.. రుచికరమైన అల్పాహారం.. భోజనాలు అందిస్తూండటంతో.. చిరుద్యోగులు, రోజు కూలీలు.. తమ ఆకలిని ఈ క్యాంటీన్ల వద్దే తీర్చుకునేవారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం మారడంతో.. వాటికి గ్రహణం పట్టింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడంతో… ఒక్కో క్యాంటీన్‌ను మూసేస్తూ వస్తున్నారు.
వారం రోజుల క్రితం.. మొత్తం అన్న క్యాంటీన్లకు… తెలుగు రంగు పూశారు. పసుపు రంగు కనిపించకుండా.. కేవలం క్యాంటీన్ అన్న పేరు మాత్రమే ఉండేలా.. తెల్లరంగు వేశారు. రాజన్న క్యాంటీన్ పేరు పెట్టి అయినా కొనసాగిస్తారని అనుకున్నారు కానీ… ఇప్పుడు మూసేయాలని.. ప్రభుత్వం నిర్ణయించుకుంది. అసెంబ్లీలో బుగ్గన.. అన్న క్యాంటీన్ల వల్ల లాభమేం లేదని.. వ్యాఖ్యానించడం.. ప్రభుత్వ దృక్పధాన్ని తెలియచేస్తోందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. ఇప్పుడు బొత్స వాటిని నిలిపివేత నిర్ణయాన్ని బయట ప్రకటించారు. గతంలో ఒక్కో చోట 900 మంది తింటే..ఇప్పుడు ఆ సంఖ్య 600కి తగ్గిందని …అలా తగ్గిపోతున్న చోట అన్నా క్యాంటీన్లను తొలగిస్తాని స్పష్టం చేశారు.
అయితే బస్టాండ్లు, ఆస్పత్రుల దగ్గర మాత్రం ఉంచుతామన్నారు. గత ప్రభుత్వం అవసరం లేని చోట కూడా క్యాంటీన్లు పెట్టిందన్నారు. కొనసాగిచే చోట.. అక్షయపాత్ర వాళ్లే క్యాంటీన్లు నిర్వహిస్తారని.. ప్రస్తుతం ఉన్న రేట్ల మీద అభ్యంతరం లేదని బొత్స ప్రకటించారు. అసెంబ్లీలో అన్న క్యాంటీన్లపై చర్చ సందర్భంగా.. వైసీపీ సభ్యులు అవినీతి ఆరోపణలు చేశారు. తెలంగాణతో పోల్చిన ఆళ్ల రామకృష్ణారెడ్డి.. ఏపీలో అన్న క్యాంటీన్‌కు 30 లక్షలకుపైగా ఖర్చు చేశారని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.