రాజధానిలో గత ప్రభుత్వం పిలిచిన రూ. 32వేల కోట్ల నిర్మాణాలకు సంబంధించిన టెండర్లు అన్నీ నిలిపి వేశామని… ఆర్థిక పరిస్థితిని చూసుకుని ఆ తర్వాత నిర్ణయాలు తీసుకుంటామని.. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు చెప్పారు. ప్రస్తుతం అమరావతిలో అంతా గందరగోళంగా ఉందన్నారు. ఏపీ రాజధానిపై సీఎం జగన్ మూడు గంటలకుపైగా సమీక్షించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన బొత్స… ఎలాంటి కీలక నిర్ణయాలను ప్రకటించలేదు. రాజధాని ప్రాంత రైతులందరికీ కౌలు పంపిణీని ప్రారంభిస్తామన్నారు. రాజధాని ప్రాంతానికి సంబంధించి ఇంకా పెండింగ్ బిల్లులు ఉన్నాయని … భూసమీకరణకు సంబంధించి 43వేల ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరిగింద్నారు. మిగతా స్థలాల రిజిస్ట్రేషన్లు జరగాల్సి ఉందన్నారు.
రాజధాని మార్పుపై జరుగుతున్న ప్రచారంపై.. బొత్స… గతంలోలానే స్పందించారు. రాజధాని గురించి ఎవరో… ఏంటో చెబితే తనకేం సంబంధమని ప్రశ్నించారు. ఎవరో చేసిన వ్యాఖ్యలపై తనను వివరణ అడగవద్దన్నారు. రాజధాని ఏ ఒక్కరి కోసమో కాదు.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సి ఉందని స్పష్టంచేశారు. రాజదధానిని కొనసాగించే ఉద్దేశంలో వైసీపీ సర్కార్ లేదని… బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ చెప్పిన విషయంపై..బొత్స సూటిగా సమాధానంచెప్పలేకపోయారు. రాజధాని మారుతుందని జీవీఎల్ ఎందుకు అన్నారో తెలియదని చెప్పుకొచ్చారు. రాజధాని ముంపు గురించి చర్చించలేదన్నారు.
సీఆర్డీఏపై ముఖ్యమంత్రి నెలవారీ సమీక్షలో భాగంగా సమావేశం ఏర్పాటు చేసినా…ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపధ్యంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. వరదలతో రాజధాని గ్రామాలు మునిగిపోయాయని..ప్రభుత్వం అదే పనిగా ప్రచారం చేయడం.. ఓ వైపు జీవీఎల్ లాంటి వాళ్లు… ప్రకటనలు చేయడంతో..ఇక ఏపీ సర్కార్ అధికారిక ప్రకటన చేయడమే మిగిలిందని అనుకున్నారు. అయితే.. ఎలాంటి నిర్ణయాన్ని ఏపీ సర్కార్ ప్రకటించలేదు. కానీ నిర్మాణాలు కొనసాగిస్తామని కూడా చెప్పలేదు.