అమరావతి రాజధానిపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు! గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని అన్నారు. విజయనగరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… రాజధాని అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉంటూనే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని మరోసారి స్పష్టం చేశారు. రాజధాని ఏ ఒక్క సామాజిక వర్గానిదో కాదనీ, ప్రజలందరిదీ అని చెప్పారు. కృష్ణా నదిలో 8 క్యూసెక్కుల నీరు వస్తేనే రాజధాని మునిగిపోయిందనీ, 11 క్యూసెక్కులు వస్తే పరిస్థితి ఏంటన్నారు బొత్స. గతంలో కూడా వరదలు వచ్చిన పరిస్థితులున్నాయన్నారు.
శివరామకృష్ణ కమిటీని మళ్లీ ప్రస్థావిస్తూ ఆ నివేదికని గత టీడీపీ ప్రభుత్వం పాటించలేదనీ, మంత్రి నారాయణ మాటల్ని చంద్రబాబు విని అమరావతిని ఎంపిక చేశారని మరోసారి విమర్శించారు. ప్రభుత్వానికి ఆర్థికంగా కూడా భారం ఎక్కువౌతోందనీ, బయట ప్రాంతాల్లో రూ. 1 లక్షలకు పూర్తయ్యే ఒక పనిని అమరావతిలో చేపడితే రూ. 2 లక్షలు ఖర్చు అవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వానికి భారమయ్యే పరిస్థితి ఉందనీ, ఇవన్నీ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. తాను మొన్న చెప్పిందీ ఇదే అనీ, ఇప్పుడూ అదే మాటకు కట్టుబడి ఉన్నానని బొత్స మరోసారి అన్నారు. రాజధానిపై పవన్ కల్యాణ్ స్పందన చూశాననీ, అవి ద్వంద్వ అర్థాలు ఇచ్చేవిగా ఉన్నాయని బొత్స వ్యాఖ్యానించారు.
మొత్తానికి, మరోసారి రాజధానిపై అనిశ్చిత వ్యాఖ్యలే చేశారు బొత్స. వైకాపా ప్రభుత్వం ఓ నిర్ణయంతో ఉందనే సంకేతాలు మరింత బలంగా ఇచ్చారు. అయితే, గతవారంలో ఆయన ఇదే తరహా వ్యాఖ్యలు చేసి… ఓ ఐదు రోజులపాటు మీడియాకి దూరంగా ఉన్నారు. ఈలోగా జరగాల్సిన చర్చంతా జరిగింది, రాజధాని అమరావతిలోనే ఉంటుందా అనే అనుమానాలు రేకెత్తాయి, రాజధాని ప్రాంత రైతులు కూడా పార్టీలకు అతీతంగా అందర్నీ కలుస్తూ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మొన్ననే బొత్స ఏమన్నారంటే… ఇదంతా మీడియా వక్రీకరణ, తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారమని యూటర్న్ తీసుకున్నారు. ఇవాళ్ల మళ్లీ,… తూచ్, వక్రీకరణ వ్యాఖ్యలు ఉత్తుత్తినే అన్నట్టు మాట్లాడుతూ, రాజధాని విషయంలో ప్రభుత్వం గట్టిగానే ఆలోచిస్తోందంటూ మళ్లీ ఇవాళ్ల మరో యూ టర్న్ తీసుకున్నారు! బాధ్యతాయుతమైన మంత్రిగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని మరీ చెప్పుకున్నారు. నిజంగానే అంత బాధ్యత ఫీలైతే… ఐదు కోట్ల ప్రజల రాజధానికి సంబంధించిన అంశంపై ఇలా పూటకోమాట మాట్లాడటం సరైందా..?