ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన లాంగ్వేజ్ తో మీడియా ముందుకు వచ్చారు. పీకే ఎన్నికల స్ట్రాటజిస్టుగా దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకోవడంతో ఎన్నికల సమయంలో రకరకాల మీడియా సంస్థలు ఆయన ఇంటర్యూలు ఇస్తున్నాయి. ఆయన అంచనాలను ఆయన చెబుతున్నారు. ఈ క్రమంలో జగన్ ఘోరంగా ఓడిపోతున్నారని.. ఆయన లీడర్ కాదని…ప్రొవైడర్ మాత్రమేనని తేల్చేశారు.
పీకే వ్యాఖ్యలపై బొత్సను రంగంలోకి దించాలని సజ్జల డిసైడయ్యి.. స్పందించాలని ఆయనకు సమాచారం పంపారు. బొత్స ప్రెస్ మీట్ పెట్టి .. తన స్టైల్లో అసలు పీకే ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆ మాట బొత్స చెప్పిన రెండు నిమిషాలకు ఎదురుగా ఉన్న రిపోర్టర్లకు అర్థమవుతుంది. అసలు పీకేకు . లీడర్‌కు, ప్రొవైడర్‌కు కూడా తేడా తెలియదా అని కూడా ఆశ్చర్యపోయారు. సీఎం జగన్ మోహన్ రెడ్డినే లీడర్ అని , చంద్రబాబు నాయుడు ప్రొవైడర్ అని తనకు తెలిసిన మార్గంలో ఎదురుదాడి చేశారు.
చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని ప్రశాంత్ కిషోర్ డబ్బా కొడుతున్నారని అన్నారు. చంద్రబాబు కోసమే ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. సిఎం జగన్ పాలనలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, అనేక విషయాలలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని బొత్స తేల్చేశారు.
అంతే కాదు.. ఇష్టమచ్చినట్లు మాట్లాడవద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. పీకే గతంలో ఐదేళ్లపాటు తమ దగ్గర కూడా పనిచేశారని.. ఆయన ఆలోచనలు తీసుకొని ఉంటే.. తాము మునిగిపోయే వాళ్లమని చెప్పుకొచ్చారు. పీకే వల్లనే గెలిచామని గత ఎన్నికల తర్వాత జగన్ అన్న మాటల్ని బొత్స మర్చిపోయారు. తమ నాయకుల దగ్గర ప్రశాంత్ డబ్బులు కూడా తీసుకున్నారని.. ఇక్కడ మేనేజ్మెంట్ తప్ప అతను చేసింది ఏమీ లేదని తేల్చేశారు.