ఏపీ మంత్రుల విధానం ఒక్కటే.. అదే ఎదురుదాడి. ఎవరు ప్రశ్నించినా…ఎదురుదాడే చేస్తున్నారు. ఏ అంశంపైనైనా అదే ప్లాన్. ఇప్పటి వరకూ టీచర్లపై అనేక రకాలుగా ఎదురుదాడి చేసిన మంత్రులు.. తాజాగా స్కూళ్ల రేషనలైజేషన్పైనా అదే చేస్తున్నారు. ప్రభుత్వ విధానాన్ని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అంతే కాదు అసలు ప్రభుత్వ స్కూళ్ల టీచర్ల పిల్లలు ఎవరైనా ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారా అని ప్రశ్నించారు.
ఇంగ్లిష్ పెట్టండి.. కానీ తెలుగు మీడియం కొనసాగించండి అని చెప్పినవారిపై .. పేదలు ఇంగ్లిష్ మీడియం చదవొద్దా అంటూ ఎదురుదాడి చేసిన అధికార పార్టీనేతలు ఇప్పుడు టీచరలపై మీ పిల్లలెక్కడ చదువుతున్నారంటూ ఎదురుదాడి చేస్తున్నారు. నిజానికి స్కూళ్ల రైషనలైజేషన్తో చాలా స్కూళ్లు మూతపడుతున్నాయి. చాలా మంది పిల్లలకు దూరాభారం అవుతోంది. స్కూళ్ల విలీనం వల్ల ఎన్నో మౌలిక సమస్యలు వస్తున్నాయని టీచర్లు మీడియాకు సమాచారం ఇచ్చి బయట పెడుతున్నారు.
నిజానికి విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ అసంతృప్తి ఉంది. అందుకే ఎమ్మెల్యేలు కూడా స్కూళ్ల విలీనం వద్దంటూ వందల కొద్దీ విజ్ఞాపనులు ప్రభుత్వానికి ఇచ్చింది. దీన్ని సరి చేసుకోవాల్సిన బొత్స సత్యనారాయణ.. టీచర్లపై ఎదురు దాడి చేస్తున్నారు. వారే దీన్ని వ్యతిరేకిస్తున్నారని … విద్యార్థుల తల్లిదండ్రులు వ్యతిరేకించడం లేదన్నారు. విద్యావ్యవస్థను మెరుగుపర్చడానికి సంస్కరణలు తీసుకు వస్తున్నామని.. వద్దనడానికి మీరెవరు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. వస్తున్న విమర్శలు..బయట పడుతున్న లోపాలను సరి చేసుకోకుండా.. బొత్స ఈ ఎదురు దాడి చేయడమేమిటనేది టీచర్లను విస్మయపరుస్తోంది.