కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం ఒక వెలుగు వెలిగి రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పిన మాజీ మంత్రి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రాష్ట్రం కోసం కాదు కదా కనీసం తన జిల్లా కోసం కూడా చేసిందేమీ లేదు. తనకు, తన కుటుంబ సభ్యులకు పదవులు, పార్టీ టికెట్లు, తన రాజకీయ, వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకొనే ప్రయత్నాలు చేసారు. రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో లక్షలాది ప్రజలు రోడ్లమీదకు వచ్చి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తుంటే, ఆయన తన ముఖ్యమంత్రి కలలను సాకారం చేసుకొనేందుకు డిల్లీలో కూర్చొని పావులు కదిపారే తప్ప రాష్ట్రం గురించి ఆలోచించలేదు. అందుకే ఆయన స్వంత జిల్లా ప్రజలే ఆయనపై తిరగబడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉంటే తనకి భవిష్యత్ ఉండదనే సంగతి గ్రహించి, మరే పార్టీలో అవకాశం లేకపోవడంతో వైకాపాలోకి చేరిపోయారు. ఆయనకి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికీ కూడా చంద్రబాబు నాయుడే ఉమ్మడి శత్రువు గనుక ఆయనకే చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి అప్పగించినట్లుంది. అందుకే మళ్ళీ నిన్న ఆయన చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు.
ప్రత్యేక హోదా విషయంలో కూడా చంద్రబాబు నాయుడు తన రెండు కళ్ళ సిద్దాంతాన్ని అమలుచేస్తున్నట్లుందని విమర్శించారు. ఒకసారి బాబు ప్యాకేజి ఇస్తే చాలని ఇంకోసారి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడుగుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఒక్కటే చాలదని, ప్రత్యేక ప్యాకేజీ కూడా అవసరమేనని ఆయన అభిప్రాయపడ్డారు. వాటి కోసం కేవలం తమ వైకాపా మాత్రమే చిత్తశుద్ధితో పోరాడుతోందని అన్నారు. కానీ ఆనాడు డిల్లీలో కూర్చొని తనకు ముఖ్యమంత్రి-ప్యాకేజి కావాలని సోనియమ్మని ప్రాధేయపడిన బొత్స సత్యనారాయణ ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ కావాలని గట్టిగా అడదగం, దాని కోసం పోరాడుతున్నామని చెప్పుకోవడం సిగ్గుచేటు. పైగా అందరినీ విమర్శించడం మరీ విడ్డూరంగా ఉంది. ఆయనే ఆనాడు చిత్తశుద్దిగా రాష్ట్రం కోసం పోరాడి ఉండి ఉంటే, ఆయన, ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికలలో ఓడిపోఎవారు కాదు. ఆ సంగతి గ్రహించకుండా ఇంకా ప్రజలను తన మాటలతో మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నారు.ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని విమర్శించినంత మాత్రాన్న ఎవరి ఇమేజ్ పెరిగిపోడు. అలా పెరుగుతుందనుకొంటే రాహుల్ గాంధీ ఇమేజ్ చాలా పెరిగిఉండాలి. కానీ పెరగలేదు. ఇదే విషయం బొత్స కూడా గ్రహిస్తే బాగుంటుందేమో?