మనిషి నచ్చకపోతే ‘రామా’ అన్నా బూతు మాటలాగే వినిపిస్తుంది. వైకాపా నేత బొత్స సత్యనారాయణ విమర్శలు, ఆరోపణలు వింటే ఆ మాట నిజమనిపిస్తుంది. ఏపికి ప్రత్యేక హోదా, ఇతర హామీల గురించి సుజనా చౌదరి డిల్లీ పెద్దలతో చర్చించిన తరువాత హైదరాబాద్ తిరిగి వచ్చేశారు. ఆ తరువాత ఆయన గవర్నర్ నరసింహన్ ని కలిసి ఆ వివరాలు తెలియజేశారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ప్రత్యేక హోదాపై కేంద్రప్రభుత్వంనిర్దిష్టమైన ప్రకటన చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇందులో అనుమానించడానికి, విమర్శించడానికీ ఏమీ లేదని అర్ధమవుతూనే ఉంది. కానీ తెదేపాని వైకాపా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది కనుక ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ, “సుజనా చౌదరి రాజ్ భవన్ ఎందుకు వెళ్ళారు? గవర్నర్ ని ఎందుకు కలిశారు? అసలు ప్రత్యేక హోదా గురించి కేంద్రప్రభుత్వం తీసుకొనే నిర్ణయం గురించి ఆయన గవర్నర్ కి చెప్పవలసిన అవసరం ఏమిటి? ఆయన దాని కోసమే వెళ్ళారా లేకపోతే ఆ సాకుతో ఓటుకి నోటు కేసు గురించి గవర్నర్ తో మాట్లాడేందుకు వెళ్ళారా?” అని సందేహాలు వ్యక్తం చేశారు.
సుజనా చౌదరి గవర్నర్ ని కలిస్తే తప్పుగా భావిస్తున్న బొత్స సత్యనారాయణ, తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, ఆ రాష్ట్ర ఏసిబి అధికారి గవర్నర్ ని కలవడం చాలా సాధారణమైన విషయమేనని సర్టిఫై చేశారు. వారిద్దరూ ఓటుకి నోటు కేసులో గవర్నర్ తో మాట్లాడేందుకు వెళ్ళడం పరిపాలనా సంబంధమైన వ్యవహారమని అన్నారు. కానీ సుజనా చౌదరి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే సాకుతో గవర్నర్ ని కలిసి ఓటుకి నోటు కేసు గురించి మాట్లాడి ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. అటువంటి పనులకి రాజ్ భవన్ ఉపయోగించుకొని దాని ప్రతిష్టకి భంగం కలిగించడం సరికాదన్నారు. రాజ్ భవన్ న్ని రాజీ భవన్ గా మార్చవద్దని గవర్నర్ కి కూడా విజ్ఞప్తి చేశారు. ఓటుకి నోటు కేసు పెట్టి 14నెలలు అవుతున్నా చంద్రబాబు నాయుడుపై తెలంగాణా ప్రభుత్వం ఎందుకు కేసు నమోదు చేయలేదని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆనాడు చంద్రబాబు నాయుడుని ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడన్న కెసిఆరే చంద్రబాబు నాయుడుని కాపాడుతున్నట్లున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
ఏపికి ప్రత్యేక హోదా గురించి కేంద్రప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకొందో ఇంకా తెలియదు. దానిపై అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు కనుక దాని గురించి సుజనా చౌదరి గవర్నర్ కి నివేదించవలసిన అవసరమే లేదు. కానీ అవసరమనుకొంటే ఆ వివరాలని గవర్నర్ కి ముందుగా తెలియజేసి ఆయన సలహా కోరినా తప్పు కాదు. అందుకు ఎవరినీ అనుమానించవలసిన అవసరమే లేదు. ఒకవేళ ఓటుకి నోటు కేసు గురించే గవర్నర్ తో మాట్లాడదలిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా వెళ్లి మాట్లాడగలరు. సుజనా చౌదరి గవర్నర్ తో ఏమి మాట్లాడారో తెలుసుకోకుండానే ఈ విధంగా అనుమానాలు వ్యక్తం చేస్తూ విమర్శలు,ఆరోపణలు చేయడం చాలా తప్పు. బొత్స వంటి రాజకీయ నేతలు తమ ఉనికిని చాటుకోవడానికి ఇటువంటి అర్ధరహితమైన పాయింట్ ఒకటి పట్టుకొని గవర్నర్ పై నిరాధారమైన ఆరోపణలు చేయడం చాలా తప్పు.