వైసీపీలో ఏ నిర్ణయం అయినా జగన్ రెడ్డి తీసుకుంటారు. అది ఎంత కామెడీగా ఉన్నా సరే అమలు చేయాల్సిందే. మరో చర్చకు తావు లేదు. కానీ బొత్స మాత్రం రాజధాని అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. బొత్స ఝాన్సీని విశాఖ అభ్యర్థిగా ఖరారు చేసినప్పుడు కూడా ఆయనతో చర్చించలేదని ఓ సందర్భంలో ఆయనే చెప్పుకున్నారు. ఇక రాజధాని అంశాలపై చర్చిస్తారా ?. మూడు రాజధానుల నిర్ణయం అప్పటి రాజకీయాల ప్రకారం తీసుకున్నదని.. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం అనేది పార్టీలో చర్చిస్తామని చెప్పారు.
ఇలా మాట్లాడిన బొత్స.. మండలిలో మాత్రం అమరావతిని శ్మశానంతో పోల్చారు. ఆయన మాటలతో కూటమి ఎమ్మెల్యేలు భగ్గుమన్నారు. తర్వాత బొత్స సర్దుకున్నారు. మూడు రాజధానులు అనేది ఎన్నికలకు ముందు చెప్పి వెళ్లి ఉంటే పెద్ద వివాదం అయ్యేది కాదు. 2019ముందు తాను అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని .. చంద్రబాబే కట్టుకోలేదని కల్లిబొల్లి కబుర్లు చెప్పాడు. అమరావతిలో రాజధానిని మార్చేది లేదన్నాడు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా అమరావతికి మద్దతు పలికాడు. గెలిచిన తర్వాత అడ్డంగా మాట మార్చడంతో ఓటర్లు ఐదేళ్ల తర్వాత ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు.
ఇప్పుడు జగన్ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామన్నా.. అమరావతికే తమ ఓటు అన్నా ఏం ప్రయోజనం ఉండదు. రాజధాని అంశంలో ఆయన పూర్తిగా ప్రజావిశ్వాసాన్ని కోల్పోయారు. ఐదేళ్ల పాటు మూడు రాజధానుల పేరుతో వ్యాఖ్యలు చేశారు కానీ.. రాజకీయంతో పబ్బం గడుపుకున్నారు కానీ.. ఒక్క ఇటుక కూడా ఎక్కడా పేర్చలేదు. చివరికి తమ రాజధాని విశాఖ అని ప్రకటించుకున్నారు. అయినా ప్రయోజనం లేకపోయింది.