మంత్రి బొత్స సత్యనారాయణ మంచీచెడూ అన్నీ మర్చిపోయి రాజకీయం చేస్తున్నారు. పదవి ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లేదన్నట్లుగా ప్రతిపక్ష పార్టీలపై కులాన్ని మాత్రమే వాడుతున్నారు. రాజధాని విషయంలో ఇప్పటికీ ఆయన కులం.. కులం.. సామాజికవర్గం అని రంకెలు వేస్తూ ఉంటారు. తాజాగా తణుకులో టీడీఆర్ బాండ్ల కుంభకోణంలోనూ టీడీపీపైనే ఆరోపణలు చేశారు. అక్కడి వైసీపీ ఎమ్మెల్యేపై టీడీపీ ఆధారాలతో సహా ఆరోపణలు చేసిన తర్వాత .. ప్రభుత్వం నిండా ముగిసినట్లుగా గుర్తించిందేమో కానీ.. అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటారని అనుకుంటున్న సమయంలో బొత్స.. కులం వాదనతో తెరపైకి వచ్చారు.
తణుకులో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు పది మంది అధికారులతో కుమ్మక్కయ్యి టీడీఆర్ బాండ్ల స్కాం చేశారని ఆరోపించారు. అక్రమాలపై తణుకు ఎమ్మెల్యే కారుమూరి పది రోజుల క్రితమే తనకు ఫిర్యాదు చేశారని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు టీడీపీ నేత పట్టాభి స్పష్టమైన ఆధారాలతో ఆరోపణలు చేస్తే.. సమాధానం చెప్పకుండా బండ బూతులు తిట్టడమే కాదు..కులాలను కూడా తీసుకొస్తున్నారు బొత్స సత్యనారాయణతో పాటు వైసీపీ నేతలు. వీరి తీరు చూసి అందరూ విస్తుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
వైసీపీ నేతలు కుదిరితే కులం లేకపోతే బండ బూతులు తిట్టడాన్ని రాజకీయంగా మార్చేసుకున్నారు. ఆరోపణలు వస్తే సమాధానాలు చెప్పాల్సిది పోయి.. ఇలా నోరు చేసుకుంటూడటంతో అంతా నిజమే అని ప్రజలు అనుకునే పరిస్థితి ఏర్పడుతోంది. నిజంగా తప్పుడు ఆరోపణలు చేస్తే వైసీపీ నేతలు ఊరుకోరు.. కేసులుపెట్టి లోపలేయిస్తారు. ఇప్పటి వరకూ జరిగింది అదే. కానీ ఏమీ చేయలేని స్థితిలో కులం పేరుతో రచ్చ ప్రారంభిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం అన్నీ వదిలేస్తున్నారు.