విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఉత్తరాంధ్ర ఇంచార్జ్ పదవి ఖాళీ అయింది. ఆ పదవి మీకిస్తున్నారా అని జర్నలిస్టులు బొత్సను అడిగితే.. ఆయన భిన్నంగా స్పందించారు. వైసీపీ ఇంచార్జ్ పోస్టు ఏమైనా బంగారమా ? అని తీసి పడేశారు. దీంతో ఆశ్చర్యపోవడం జర్నలిస్టుల వంతు అయింది. బొత్స వ్యవహారశైలి వైసీపీని సపోర్టు చేస్తున్నట్లుగా ఇటీవల ఉండటం లేదు. తాను రాజకీయంగా యాక్టివ్ గా ఉండటానికి అప్పుడప్పుడు ప్రెస్మీట్లు పెడుతున్నట్లుగా ఉన్నారు కానీ.., పార్టీ వ్యవహారాల గురించి పెద్దగా పట్టించుకోవడంలేదు.
ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇంచార్జ్ పదవి వస్తుందంటే అదేమైనా బంగారమా అంటున్నారు. వైసీపీ పరిస్థితి ఘోరంగా ఉంది. సీనియర్ నేతగా ఆయనకు పరిస్థితి అర్థమవుతుంది. ఆయన కూడా సరైన ఫ్లాట్ ఫాం కోసం చూస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆరోగ్య కారణాల రీత్యా కూడా బొత్స అంత ఒత్తిడికి గురయ్యే ఉద్దేశంలో లేరు. అందుకే పార్టీ పదవుల విషయంలోనూ ఆయన అంత ఆసక్తిగా లేరు.
ఉత్తరాంధ్ర నుంచి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కన్నా విజయసాయిరెడ్డే ఎక్కువ పెత్తనం చేసేవారు. ఉత్తరాంధ్ర సీఎం అని పిలిపించుకునేవారు. బొత్సను విజయనగరం వరకే పరిమితం చేశారు . ఇప్పుడు కూడా ఆయనకు గోదావరి జిల్లాల ఇంచార్జ్ పదవి ఇచ్చారు కానీ.. ఉత్తరాంధ్రకు చాన్సివ్వలేదు. మళ్లీ విజయసాయిరెడ్డిని తెచ్చి పెట్టారు. కానీ ఆయన సన్యాసం తీసేసుకోవడంతో.. మళ్లీ పెద్దదిక్కుగా బొత్స పేరు వినిపిస్తోంది.కానీ జగన్ సుబ్బారెడ్డిని పెడతారన్న ప్రచారం జరుగుతోంది.