మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతున్న సమయంలో ఏపీ మంత్రులు చిత్ర విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నారు. అందులో మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చేరిపోయారు. మంత్రివర్గ ప్రక్షాళన విషయంలో నాయకుడికి పూర్తి స్వేచ్చ ఉంటుందని ప్రకటించారు. ఈ క్రమంలో తన విధేయతను ప్రకటించేందుకు ఆయన వైఎస్ఆర్సీపీని కన్నతల్లితో పోల్చారు. పార్టీ కన్నతల్లిలాంటిదని చెప్పుకొచ్చారు. బొత్స మాటలు విని జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోయారు.
ఆయన కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు..పీసీసీ చీఫ్‌తో సహా అనేక పదవులు ఇచ్చి… ఓ అనామకుడైన వ్యక్తిని ఇలా ఏపీలో కీలక రాజకీయనాయకుడిగా మార్చిన కాంగ్రెస్ పార్టీ తల్లి కాకుండా పోయిందా అనే డౌట్ వారందరికీ వచ్చింది మరి. జగన్ ఎలాంటి నిర్ణయం తీుకున్నా పార్టీ తల్లి లాంటిదని.. అందరం కలిసికట్టుగా ఉంటామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ మాట చెబితే దానికి కట్టుబడి ఉంటామన్నారు.
అందర్నీ తీసేసినా బొత్స పదవి మాత్రం పదిలం అన్న చర్చ జరుగుతున్న సమయంలో బొత్స ఇలా విధేయంగా స్పందించడం వైఎస్ఆర్సీపీలో పెద్దగా చర్చనీయాంశం కాలేదు కానీ..బయట ప్రజలు మాత్రం.. బొత్స అంటే అంటే అంతే మరి అనుకోకుండా ఉండలేకుపోతున్నారు. వైఎస్ఆర్సీపీలో అందరూ ఇప్పుడు ఎవరికి వారు తమ విధేయతా ప్రదర్శనలో భాగం అవుతున్నారు. అందులో బొత్స కూడా తగ్గడం లేదు.