ఉత్తరాంధ్రపై దండయాత్రకు వస్తారా ? ఇటు వైపు అడుగు పెడితే తొక్కేస్తాం ? మా ప్రాంతానికి వచ్చి మా గుడిని వేడుకుంటారా ? లాంటి డైలాగులతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్న ఉత్తరాంధ్ర వైసీపీ నేతలకు మంత్రి బొత్స సత్యనారాయణ షాక్ ఇచ్చారు. పరిపాలనా.. అభివృద్ధి వికేంద్రీకరణపై విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైసీపీ నేతలు చాలా మందిని తీసుకొచ్చారు. ఈ సమావేశానికి హాజరైన బొత్స.. వైసీపీ నేతలు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలపై మండిపడ్డారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
అమరావతికూడా ఏపీలో భాగమేనని అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా ఇక వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. బొత్సలో ఒక్క సారిగా వచ్చిన ఈ మార్పు చేసి వైసీపీ నేతలు ఆశ్చర్యపోయారు. గతంలో అమరావతిని తూలనాడింది.. అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులు అన్నది బొత్సనే. ఇప్పుడు ఆయన తేడాగా మాట్లాడే సరికి వైసీపీ నేతలకు ఫ్యూజులు ఎగిపోయినట్లయ్యాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రజాభిప్రాయం అంచనా వేసి ఆయన మెల్లగా ప్లేట్ ఫిరాయిస్తున్నారన్న అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.
వైఎస్ఆర్సీపీలో ఇటీవలి కాలంలో అంతర్గత పరిణామాలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఎన్నికలకు ముందు అవి బయటపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. జగన్ నిర్ణయాలతో సీనియర్లు చాలా వరకూ విభేదిస్తున్నారు. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాగైతే తమ పుట్టి మునిగిపోతుందని భయపడుతున్న వారు మెల్లగా విధానం మార్చుకుంటున్నారని అంటున్నారు. బొత్స సత్యనారాయణ ఇటీవలి కాలంలో గతంలోలా దూకుడు ప్రకటనలు చేయడంలేదు. వీలైనంత లో ప్రోఫైల్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు.