రాజధాని నిర్మాణాలను కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం..భూములిచ్చిన రైతుల్లో ఆనందానికి కారణం అయింది. ఇది ప్రభుత్వంపై పాజిటివ్ అభిప్రాయం ఏర్పడటానికి ఆస్కారం ఏర్పరిచింది. అయితే.. ఈ పాజిటివ్ వేవ్ ని.. బొత్స ఒక్క మాటతో… పాతాళానికి పంపేశారు. అమరావతిని శ్మశానంతో పోల్చడంతో.. రైతులు విరుచుకుపడ్డారు. బొత్స తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. తమను రైతులుగా చూడాలని.. పార్టీలు, వర్గాల వారీగా కాదన్నారు. తాము భవిష్యత్ తరాల కోసం భూములను త్యాగం చేశామని స్పష్టం చేసారు. రాజధానిని స్మశానంగా అభివర్ణించడం ఏమిటని, ఆ స్మశానంలోనే సచివాలయం, అసెంబ్లీ, ఉందని అక్కడే కూర్చుంటున్నారనే విషయం మరచిపోవద్దని రైతులు గుర్తు చేశారు.
తాను చేసిన శ్మశానం వ్యాఖ్యలు తీవ్ర వివాదం అవడంతో.. బొత్స సత్యనారాయణ వివరణ ఇచ్చారు. రాజధాని ఏమి చూసేందుకు వస్తావని మాత్రమే తాను అడిగానని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజధాని అమరావతిలో నిర్మాణాలను పూర్తిగా నిలిపివేసింది. రైతులకు కౌలు ఇవ్వడం మినహా ఇంకెలాంటి ముందడుగు వేయలేదు. రాజధాని, రాష్ట్రంలోని మిగతా నగర, పట్టణ ప్రాంతాల అభివృద్ధి కోసమంటూ ఒక కమిటీని కూడా నియమించింది. రాష్ట్ర హైకోర్టును కర్నూలుకు మార్చాలని కొందరు, ఇక్కడే ఉంచాలని మరికొందరు ఉద్యమాలు చేశారు. హైకోర్టు ను రాయలసీమకు మార్చే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందని ఓ మంత్రి చేసిన ప్రకటనతో ఉద్యమం మరింత ఊపందుకుంది.
రాజధాని రైతాంగంలో కూడా అలజడి ప్రారంభమైంది. రాజధానిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నిర్ణయానికి వచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే డిసెంబర్ తొమ్మిదో తేదీ నుంచి తమకు మంజూరు చేసిన ప్లాట్లలో దీక్షలకు దిగుతామని రైతులు హెచ్చరించారు. ఈ పరిస్థితుల మధ్య..చంద్రబాబునాయుడు ఈనెల 28వ తేదీన రాజధాని పర్యటనకు వెళ్తున్నారు. ముందు ముందు రాజధాని రాజకీయం మరింత సెగలు రేపే అవకాశం కనిపిస్తోంది.