ధర్మాబాద్ కోర్టు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నోటీసులు రావడం తెలిసిందే. పదేళ్ల కిందట బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ జిల్లాలకు అన్యాయం జరుగుతుందన్న అంశమై చంద్రబాబు పోరాటం చేశారు. అప్పట్లోనే కేసు నమోదు చేశారు. ఇప్పుడా కేసుకు సంబంధించి కదలిక వచ్చింది. దీనిపై వైకాపా నేత బొత్స సత్యనారాయణ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు ఊహించిందేననీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు వ్యవస్థలు మేనేజ్ చేయడంలో దిట్ట అన్నారు బొత్స! ఆస్తుల మీదొచ్చిన కేసులోనే ఆయన స్టే తెచ్చుకున్నారనీ, పోలవరంలో పెద్ద అవినీతి జరుగుతున్నప్పటికీ… కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చినప్పటికీ, అంతకుముందు పెట్టినప్పటికీ, దాని మీద కూడా స్టే తెచ్చుకున్నారే అన్నారు.
ఆయనకి ఇది చిన్న కేసనీ, దీని ద్వారా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తారని మేం ముందే ఊహించామన్నారు. మహారాష్ట్రలో అన్నీ మేనేజ్ చేసుకుని, ఏపీకి వచ్చి సానుభూతి పొందినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. తమకు కేంద్రంతో కలిసి కుట్ర చేసే సామర్థ్యమే ఉంటే జగన్ మీదున్న కేసులన్నీ రాత్రి రాత్రే కొట్టించుకోవాలి కదా అంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా బొత్స చెప్పారు. అందుకే న్యాయపోరాటం చేస్తున్నామనీ, చంద్రబాబు గతంలో పెట్టిన కేసులతోపాటు ఇతర కేసులపై ధర్మపోరాటం చేస్తున్నామన్నారు. వ్యవస్థ కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం పోరాటం చేసుకుంటూ ముందుకు సాగుతున్న పార్టీ తమది అన్నారు.
మహారాష్ట్రలో చంద్రబాబు మేనేజ్ చేసుకుంటారని బొత్స అనడం మరీ విడ్డూరంగా ఉంది. అయినా, ఇది కోర్టుకు సంబంధించిన వ్యవహారం, అక్కడి అధికార పార్టీతో మేనేజ్ చేయగలిగేది ఏముంటుంది..? పైగా అక్కడున్నది భాజపా సర్కారు. ఇలా జరుగుతుందని బొత్స ముందే ఊహించారట! అంటే, ఊసుపోక కేసుల్ని తవ్వి తలకెత్తుకోవడం ఎవరికైనా సరదానా..? తమకు అంత మేనేజ్మెంట్ నైపుణ్యం ఉంటే జగన్ కేసులే కొట్టించేసుకునేవాళ్లం కదా అన్నారు! ఒకవేళ రాజకీయంగా ఆ స్థాయి పట్టు వైకాపాకి వస్తే… కేసుల్ని మేనేజ్ చేసేసుకుంటారన్నమాట. ఇలా అంటూనే జగన్ కేసుల్ని ఎదుర్కోవడం ధర్మపోరాటం అంటారే. వాస్తవం ఏంటీ.. జగన్ ఎదుర్కొంటున్న కేసులు ఆయన వ్యక్తిగతమైనవి. అవి కూడా అవినీతి ఆరోపణలకు సంబంధించినవి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ధర్మాబాద్ నుంచి వచ్చిన నోటీసులు ఒక ప్రజా పోరాటానికి సంబంధించినవి. అక్రమ ఆస్తుల కేసులో ఇరుక్కుని కోర్టుకు హాజరు కావడానికీ… ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా నమోదైన కేసులో కోర్టుకు హాజరు కావడానికి చాలా తేడా ఉంది. ఇది బొత్సకు తెలిసినట్టుగా లేదే..!