ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ రాజధాని అంటే కామెడీ అయిపోయింది. ఓ సారి మూడంటారు.. మరో సారి ఉప రాజధానులంటారు.. మరోసారి హైదరాబాదే రాజధాని ఏం చేసుకుంటారో చేసుకోండి పొండి అంటున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పుడు ఏపీకి రాజధాని అమరావతి కాదని హైదరాబాదేనని ప్రకటించేసి అందర్నీ విస్మయపరిచారు. విభజన చట్టం ప్రకారం 2024 దాకా హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నారు. దీంతో..హైదరాబాద్ రాజధాని అని స్పష్టం చేశారు. దీనికి కొనసాగింపుగా అమరావతిని తమ వరకు శాసన రాజధానిగా భావిస్తున్నామని చెప్పుకొచ్చారు.
విభజన చట్టంలో పదేళ్లు ఉమ్మడి రాజధాని అని ఉంది. అయితే పదేళ్ల పాటు అక్కడే ఉండాలని లేదు. ఈ విషయాన్ని న్యాయనిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. కానీ ప్రభుత్వం అమరావతిని మాత్రం రాజధానిగా అంగీకరించకూడదన్నట్లుగా ఏదేదో మాట్లాడేస్తున్నారు. బొత్స వ్యాఖ్యలతో రాజధాని అంశంపై వైసీపీ మరింత గందరగోళంలో ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. హైకోర్టు తీర్పును అంగీకరించలేక.. చట్ట పరంగా ఎలా ముందుకు వెళ్లాలో తెలియక … అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
బొత్స వ్యాఖ్యలపై టీడీపీ మండిపడింది. ఏపీ రాజధాని హైదరాబాద్ అయితే.. అక్కడికే వెళ్లిపోవాలంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు. 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాదేనన్న మంత్రి బొత్స కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. విభజన తరువాత ఏపీ నుంచే పాలన సాగించాలని అమరావతికి వచ్చామని గుర్తు చేశారు. ఇప్పుడు రాజధాని విషయంలో గందరగోళం సృష్టిస్తున్నారన్నారు.