ఆంధ్రప్రదేశ్ పాలకులు ఎంత దారుణమైన ఆలోచనతో ఉన్నారో మంత్రి బొత్స సత్యనారాయణ మాటలే చెబుతున్నాయి. మా విధానాలు బాగో లేకపోతే తాము ఓడిపోతామని .. మీకేంటి నష్టమని ఆయన అంటున్నారు. ఓ మంత్రిగా.. ప్రభుత్వ విధానాలను నిర్ణయిస్తున్న వ్యక్తి ఇంత కురుచబుద్దితో ఆలోచించడం వల్లనే ఆంధ్రప్రదేశ్‌కు ఇలాంటి దుస్థితి వచ్చింది. పాలకుడు … అడ్డదిడ్డమైన నిర్ణయాలు తీసుకుని రాష్ట్ర భవిష్యత్‌ను రిస్క్‌లో పెట్టి సరిగ్గా పాలించకుండా ఓడిపోతే పోయానని అనుకోవడం ద్వారా రాష్ట్రానికి ఏం మేలు చేసినట్లు ?
అన్నీ ప్రజలకు చెప్పి చేయలేమంటున్న ఏపీ ప్రభుత్వం !
తమ విధానాలు బాగోలేకపోతే.. తాము ఓడిపోతామని బొత్స చెప్పుకొచ్చారు. అలా ఓడిపోవడం వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి నష్టం ఉండదు. నష్టపోయేది వైసీపీ నేతలే. ఈ మూడున్నరేళ్లలో చేసిన పనులకే.. ఇప్పుడు అధికారం పోతే ఎలా బతకాలా అనే పరిస్థితికి వైసీపీ క్యాడర్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రుల స్థాయిలో ఉన్న వారు.. ఓడిపోతామని తేలిగ్గా తీసుకోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. రాష్ట్ర భవిష్యత్ ను అంధకారంలోకి మార్చే నిర్ణయాలను ఈ కొద్ది కాలంలో తీసుకున్నారు. వాటిని ఎగ్జిక్యూట్ చేయలేక.. కోర్టులకు .. ప్రచారాలకు వందల కోట్లు ఖర్చు చేసి ఖాళీగా ఉన్నారు. అన్నీ ప్రజలకు చెప్పి చేయాలా.. అని దీనిపై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారు.
ఓడిపోతే సరే.. రాష్ట్రానికి జరిగిన నష్టం బాధ్యతేంటి?
మహా అయితే ఓడిపోతాం అంతే కదా అని బొత్స సత్యనారాయణ చెబుతున్నారు. కానీ ఆయన ఓ రాజకీయ నాయకుడు మనస్థత్వంతో ఆ వ్యాఖ్యలు చేయలేదు.. రాజకీయ వ్యాపారంలో ఉన్న వ్యక్తిగా చేస్తున్నారు. ఐదేళ్లు భారీ లాభాలు పొందాను.. తర్వాత రాకపోతే ఏమయిందని అనుకుంటున్నారు. రాజకీయ వ్యాపారిగా కాకుండా.. రాజకీయనేతగా ఆలోచించి ఉంటే.. ఆయన రాష్ట్రం గురించి.. ప్రజల గురించి ఆలోచించి ఉండేవారు. ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రానికి చేసిన నష్టం గురించి ఆలోచించి ఉండేవారు. మూడేళ్ల కాలంలోనే రాష్ట్ర భవిష్యత్‌ను 30 ఏళ్ల వరకూ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి ఏం చేశారో తెలుసుకుని .. బాధపడి ఉండేవారు. మూడున్నరేళ్లుగా పైసా రాష్ట్ర సంపదన పెంచకుండా.. పాతిక వేల కోట్ల మేరకు ప్రజల ఆదాయాన్ని మద్యం రూపంలో వసూలు చేస్తున్న వైనాన్ని గుర్తు చేసుకుని సిగ్గుపడతారు. కానీ మంత్రిగారు మాత్రం.. మేం ఓడిపోతాం అంతే కదా అంటున్నారు.
వైసీపీ ఓడిపోతే ఎవరికీ నష్టం లేదు.. కానీ బాధ్యత ఉండొద్దా ?
ఏపీలో ప్రతి ఒక్క వ్యవస్థ నాశనం అయిపోయింది. విద్యా వ్యవస్థ కూడా అంతే. లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయింది. కుల, మత, ప్రాంత చిచ్చుతో పబ్బం గడుపుకుంటున్నారు. ఒక్క పరిశ్రమ రాలేదు. చేయాల్సినదంతా చేసి.. మేం ఓడిపోతాం అంతే కదా అని సీనియర్ మంత్రి తేలిగ్గా తీసుకుంటున్నారు. కానీ ఐదేళ్లలో చేసిన విధ్వంసానికి ఎవరు బాధ్యత వహిస్తారు ?