రాజధానిగా అమరావతిని ఇప్పుడల్లా తరలించే పరిస్థితి లేదని ఓ వైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటనలు చేస్తూంటే.. మరో మంత్రి బొత్స.. అమరావతిలో కలియ తరిగేస్తున్నారు. దాదాపుగా పూర్తయిన భవనాలను.. మౌలిక సదుపాయలను పరిశీలించేస్తున్నారు. గత శనివారం ఆయన సీఆర్డీ కమిషనర్‌ను వెంట బెట్టుకుని కరకట్ట రోడ్ అంతా పరిశీలించారు. అది రెండు లైన్లు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించారు. ఈ రోజు మంత్రి .. పలువురు అధికారుల్ని వెంట బెట్టుకుని .. భవనాలను.. పరిశీలించారు. అన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. అటు పెద్దిరెడ్డి ప్రకటన.. ఇటు బొత్స పనులకు.. ఎక్కడో రిలేషన్ ఉన్నట్లుగా.,.. అందరిలోనూ సందేహాలు ప్రారంభమయ్యాయి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను మార్చే క్రమంలో… ప్రస్తుతానికి ఓ అడుగు ప్రభుత్వం వెనుకడుగు వేసినట్లుగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అమరావతిలో దాదాపుగా రూ. పదివేల కోట్ల విలువైన పనులు జరిగాయి. కొన్ని భవనాలు అందుబాటులోకి రాగా.. చాలా భవనాలు ఫినిషింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. వాటిని పూర్తి చేస్తే.. ఉద్యోగులకు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు.. జడ్జిలు.. ఇలా అందరికీ కావాల్సిన వసతి లభిస్తుంది. మిగిలిపోయిన రోడ్లను పూర్తి చేస్తే.. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పడతాయి. అయితే.. కొత్త ప్రభుత్వం వాటన్నింటినీ లైట్ తీసుకుంది. అక్కడ ఎలాంటి రాజధాని అవసరం లేదని డిసైడయి.. విశాఖకు వెళ్లిపోవాలని అనుకుంది. చట్టం.. న్యాయం.. రాజ్యాంగం.. అడ్డం వచ్చినా.. తనదైన పద్దతిలో తాము విశాఖకు వెళ్లిపోవాలనుకున్నారు కానీ.. మధ్యలో కరోనా వచ్చి అడ్డం పడింది. దానితో ఏలా డీల్ చేయాలో తెలియక.. ఈ పరిస్థితుల్లో తరలించడం సాధ్యం కాదు కనుక ప్రస్తుతానికి వెనక్కి తగ్గారేమో అని కొంత మంది ఆలోచన చేస్తున్నారు.
విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే సరికి.. విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను తరలించాలని ఉద్యోగులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. అలా అయితే రాగలమని.. తర్వాత అయితే.. పిల్లల చదువులకు ఇబ్బందులు ఎదురవుతాయన్న చర్చ జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కావడం లేదు. దీంతో.. ఈ ఏడాదికే.. అమరావతిలోనే కొనసాగించి.. తర్వాత చూద్దామన్న అభిప్రాయానికి వచ్చేసి ఉంటారని భావిస్తున్నారు. అందుకే.. దాదాపుగా పూర్తయిన భవనాలపై .. దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో అమరావతి విషయంలో వెనక్కి తగ్గినట్లుగా ప్రకటనలు చేస్తుందో.. అమరావతి నిర్మాణం మళ్లీ ప్రారంభించబోతున్న సంకేతాలు ఇస్తుందో..అధికారికంగా ప్రకటిస్తేనే కానీ తెలియదు.