సమ్మె విరమించకపోతే ప్రత్యామ్నాయం చూసుకంటాం అని అంగన్వాడి కార్మికులకు మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నో మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చి ఐదేళ్ల పాటు నానా ఇబ్బందులు పెట్టి ఎన్నికలకు ముందు అయినా సమస్యలు పరిష్కరిస్తరనుకుంటే.. ఉద్యోగాలు తీసేస్తామని హెచ్చరిస్తున్నారు. అయితే బొత్స మాటలు వ్యక్తిగతం కాదు.. ప్రభుత్వానివే. ఆ ప్రత్యామ్నాయం ప్రభుత్వానికే ఉందా ? ప్రజలకులేదా ?
ప్రజాస్వామ్యంలో ప్రత్యామ్నాయం ఉండేది ప్రజలకే . ఆ విషయం ఏపీ ప్రభుత్వ పెద్దలకు తెలియనంతగా అధికార అహంకారం నెత్తికెక్కేసింది. అందుకే ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారు. బెదిరిపులకు దిగుతున్నారు. కానీ ఇంత కాలం తొక్కి పట్టారేమో కానీ.. ఒక్క సారిగా రోడ్డెక్కుతున్న వర్గాలను ఇక ఆపలేరని స్పష్టమవుతోంది.. అందుకే ప్రత్యామ్నాయం చూస్తారని అంటున్నారు. కానీ.. అసలు ప్రత్యామ్నాయం వీరు చూస్తారో లేదో కానీ… వారు మాత్రం ఖచ్చితంగా ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకునే అధికారాన్ని కలిగి ఉన్నారు.
రాచరికపోకడకుపోయి.. పోలీసుల్ని .. వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకుని తాము అనుకున్నదే చేస్తామని ఎవరైనా కాలికంద చెప్పుల్లా పడి ఉండాలని.. ఇచ్చింది తీసుకుని పాలాభిషేకాలు చేయాలంటే..కుదరదని.. సమాజంలోని అన్ని వర్గాలు చెబుతున్నాయి. సరైన సమయంలో అందరూ బయటకు వస్తున్నారు. ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రభుత్వం చెప్పే ప్రత్యామ్నాయం… ప్రజలకూ ఉంది మరి ..తేల్చుకుంటారు .