అమరావతిలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. సీఎం జగన్ పాలనలో అంతా బాగుందనీ, దాన్ని ఓర్వలేక ఏదో ఒకలా దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే లేనిపోని గొడవల్ని సృష్టిస్తున్నారని మంత్రి బొత్స అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్లు, ఎస్పీలకు గతంలో.. అంటే, 2014లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడారో… 2019లో అధికారంలోకి వచ్చాక కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి జగన్ ఎలా మాట్లాడారో ఒక్కసారి పోల్చి చూడాలన్నారు. ఆరోజు చంద్రబాబు… అధికారులు అప్రమత్తంగా ఉండాలనీ, ఇది మా ప్రభుత్వం, మా ఎమ్మెల్యేలు, మా కార్యకర్తలు ఏం చెబితే అదే చెయ్యాలి, అంతే తప్ప మీరంటూ మీ కార్యక్రమాలు చేస్తే కాదు, వాళ్లే మీకు దశాదిశా నిర్దేశిస్తారు అనే అర్థం వచ్చేలా చంద్రబాబు నాడు మాట్లాడారు అన్నారు బొత్స. చట్టాలను మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నట్టు, కార్యకర్తలు ఏం చెబితే అదే చెయ్యాలన్నట్టుగా చెప్పారని బొత్స అన్నారు.
నిజానికి, 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, తొలిసారిగా కలెక్టర్లు, ఎస్పీలతో విజయవాడలో చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. అప్పుడాయన ఏమన్నారంటే… తెలంగాణలో ఉన్న ఆంధ్రా విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్ మెంట్ అమలు చేయడం ఏమంత కష్టం కాదన్నారు. మంచి పనులు చేసే అధికారులకు సహకారం, ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందన్నారు. మీరు తప్పులు చేస్తే… నాక్కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి, ఎక్స్ క్యూజ్ చెయ్యలేమన్నారు. ధైర్యంగా నిజాయితీతో ఏ పనైనా చెయ్యండీ, మీకు నా సపోర్ట్ ఉంటుందన్నారు. రైతు రుణమాఫీ విషయంలో బ్యాంకులు రీషెడ్యూల్ చెయ్యకపోయినా, ఆర్.బి.ఐ. అనుమతి ఇవ్వకపోయినా… అమలు చేయడానికి ఏం చెయ్యాలో ఆలోచించాలన్నారు. పారిశ్రామికవేత్తల్ని శత్రువుగా చూడొద్దనీ, మనకు పెట్టుబడులు వచ్చే విధంగా వ్యవహరించాలని అధికారులకు చెప్పారు. ప్రభుత్వం ఐదేళ్లే ఉంటుందనీ, కానీ ఆ ఐదేళ్లకే తన విజన్ పరిమితం కావడం లేదనీ, పదిహేనేళ్ల టైం తీసుకుని మనం ఏం చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో ఆలోచిద్దాం అన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీపడొద్దనీ, ఎలాంటి ఒత్తిళ్లకీ లొంగొద్దనీ ఎస్పీలకీ చెప్పారు.
దాదాపు ఇలాంటి అంశాలతోనే నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల సమావేశం జరిగింది. ఇప్పుడు, మంత్రి బొత్స సత్యనారాయణ చెబుతున్నట్టుగా… రకరకాల అర్థాలు వచ్చేలా, టీడీపీ నాయకులు చెబితే మాత్రమే వినాలని అనిపించేలా, చట్టాలని పరిగణనలోకి తీసుకోవద్దు అనేలా, బెదిరించేలా చంద్రబాబు ప్రసంగంలో ఇతర మీనింగులు కనిపించలేదు. ఏదో ఆరోపణలు చెయ్యాలన్నట్టుగా చేసినట్టుగా బొత్స తీరు కనిపిస్తోంది, అంతే.