వైసీపీ ప్రభుత్వంలో ప్రశ్నించడానికి చాన్స్ లేదు. సామాన్యుల సంగతి చెప్పాల్సిన పని లేదు. మంత్రులకు కూడా లేదు. తమకు వచ్చిన సూచనల ప్రకారం.. మీడియా ముందు మాట్లాడటమే వారి ప్రధాన విధి. నిర్దేశించిన కార్యక్రమాల్లో పాల్గొనడం మరో విధి. నిన్నామొన్నటిదాకా మంత్రి బొత్స సత్యనారాయణ అదే చేశారు. సీనియర్ మంత్రి అయినా ఆయన ఎక్కువగా విశాఖ.. విజయనగరంలోనే కాలక్షేపం చేస్తూ ఉంటారు. అమరావతిపై ఏదైనా వివాదాస్పద ప్రకటనలు చేయాలంటే…మళ్లీ అమరావతికి వచ్చి ఏం చేస్తాం లే అని విశాఖలోనే ప్రెస్‌మీట్ పెట్టి చెప్పేస్తూంటారు. ఆయన శాఖాపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాలు అరుదు. అయితే… నిన్న మున్సిపల్ ..పట్టణాభివృద్ధి మంత్రిగా ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేరుగా ప్రభుత్వాన్ని కాకుండా… ఆ కార్యక్రమంలో అనేక అంశాలపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే హైలెట్ అవుతోంది.
ఏపీ సర్కార్… 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న వారికి చేయూత పథకం కింద నిధులు ఇస్తోంది.ఆ నిధులతో వారు వ్యాపారాలు చేయాలన్న ఉద్దేశంలో పలు సంస్థలతో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. అలా ఒప్పందాలు చేసుకోవడానికి పదహారు కంపెనీల ప్రతినిధులు అమరావతి వచ్చారు. సంబంధిత మంత్రిగా బొత్స కూడా హాజరయ్యారు. కార్యక్రమం మొత్తం ఆయన అసహనంతో ఉన్నారు. అమూల్ ప్రతినిధుల్ని చూసి.. ఆయన మండిపడ్డారు. గతంలోనే అమూల్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది కాబట్టి మళ్లీ ఒప్పందం ఎందుకని ఆయన ప్రశ్నించారు. వారితో ఒప్పందం అవసరం లేదన్నారు. ఆ కంపెనీల ప్రతినిధులు కొంత మంది రైతులు గురించి ప్రసంగించారు. ఇది కూడా బొత్సలో మరో అనుమాన బీజం పడేలా చేసింది. అసలు ఈ ఒప్పందాలకు రైతులకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఇది 45నుంచి60 వయసు మధ్య ఉండే మహిళలకు స్వయం శక్తి కోసం అని గుర్తు చేశారు.
ఇలా సమావేశం అసాంతం.. బొత్స అధికారులను ప్రశ్నిస్తూనే ఉన్నారు. బొత్స వ్యక్తం చేసిన అభిప్రాయాలు అన్నీ కరెక్టే కానీ.. వాటికి సమాధానం అధికారుల వద్ద లేదు. అయితే.. మొదటి నుంచి ఇంతే జరుగుతోందని.. ఎప్పుడూ నోరెత్తని బొత్స ఇప్పుడు మాత్రమే.. ఎందుకు ఫైర్ అవుతున్నారన్న చర్చమాత్రం.. వైసీపీలో ప్రారంభమయింది. బొత్స సత్యనారాయణకు ఇటీవల వైసీపీలో సెగ తగలడం ప్రారంభమయిందని అంటున్నారు. ఉత్తరాంధ్రలో ఆయనకు ప్రాధాన్యత లేకపోవడమే కాదు.. రాజకీయంగా బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అనుమానిస్తున్నారంటున్నారు. అందుకే.. మెల్లగా.. ఇలా ప్రశ్నించడం ద్వారా.. తన ప్రాధాన్యతను మళ్లీ దక్కించుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు.