మంత్రి బొత్స సత్యనారాయణ కంచుకోట చీపురుపల్లిలో ఎదురీదుతున్నారు. ఆయన ఇతర మండలాల్లో వెనుక బడినా మొరకముడిదాం అనే మండలంలో భారీ మెజార్టీ వస్తుంది. ఈ కారణంగా ఆయన స్వల్ప తేడాతో అయినా బయటపడుతూ వస్తున్నారు. కానీ ఈ సారి ఆ మొరకముడిదాం మొత్తం ఈ సారి బొత్సకు మూడిందన్న సంకేతాలు పంపుతోంది. పార్టీ క్యాడర్ అంతా గుడ్ బై చెప్పి టీడీపీలో చేరుతున్నారు. వారిని ఆపేందుకు బొత్స మేనల్లుడు చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయి.
వారం రోజుల కిందట మండలంలో మేజర్ పంచాయతీ అయిన సోమలింగాపురం వైసీపీ నేతలంతా టీడీపీలో చేరిపోయారు. గురువారం చంద్రబాబు సమక్షంలో కోట్ల సుగుణాకర్ రావు అనే నేతతో పాటు మాజీ ఎణ్మెల్యే గద్దె బాబూరావు కూడా టీడీపీలో చేరారు. సుగుణాకర్ రావు పార్టీ మారడం బొత్సకు పెద్ద దెబ్బని భావిస్తున్నారు. ఆయనను ఆపేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. బొత్సకు ఏకపక్షంగా ఓట్లేసే గ్రామాల్లో ఇప్పుడు రెండు వర్గాలయ్యాయి.
మరో వైపు టీడీపీ తరపున యువ నాయకుడు కిమిడి నాగార్జున సామాన్యుల్లో సామాన్యుడిగా తిరుగుతున్నారు. ప్రతీ గ్రామానికి వెళ్తున్నారు. అందర్నీ పలకరిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి అమెరికాలో మంచి ఉద్యోగం చేసుకుంటున్న ఆయన రాజకీయాల కోసం అన్నీ వదిలేసి వచ్చారు. ప్రభుత్వ నిర్వాకాలపై పోరాడుతున్నారు. మాజీ మంత్రి కిమిడి మృణాళిని కుమారుడు నాగార్జున. గత ఎన్నికల్లో చివరి క్షణంలో టిక్కెట్ దక్కించుకుని పోటీ చేశారు. ఓడిపోయినా నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని ఉన్నారు. ఆ ప్రయత్నాలు ఫలించే సూచనలు కనిపిస్తున్నాయి.