ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రభుత్వం వ్యూహాత్మకంగా గందరగోళం సృష్టిస్తోంది. ఓ సారి రాజధాని మారుస్తామన్నట్లుగా.. మరోసారి రాజధాని అక్కడే ఉంటుందన్నట్లుగా.. ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో శాసనమండలి సభ్యులు అడిగిన ప్రశ్నలకు.. రాజధానిని మార్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మంత్రి బొత్స సత్యనారాయణ సూటిగా సమాధానం ఇచ్చారు. కానీ.. ఒక్క రోజులోనే.. మళ్లీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట మార్చారు. రాజధానిపై స్పష్టత కోసం ఇప్పటికే ఒక కమిటీ వేశామని, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని చెప్పుకొచ్చారు. నిన్నటి వరకు ఉన్న పరిస్థితిని కౌన్సిల్ లో తాను చెప్పానని చెప్పుకొచ్చారు.
కారణం ఏదైనా.. ఏపీ సర్కార్ కు మాత్రం అమరావతి రాజధానిగా ఉండటం ఇష్టం లేనట్లుగా.. కనిపిస్తోంది. అలా అని మార్చే వెసులుబాటు కూడా లేకుండా పోయింది. మరో వైపు జరుగుతున్న అభివృద్ధిని ఆపేశారన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతోంది. అందుకే.. నిర్మాణాలు కొనసాగించాలన్న ఆదేశాలు జారీ చేశారంటున్నారు. కానీ అవి ప్రారంభమవ్వాలంటే…. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వం క్లారిటీగా లేదు. మరో వైపు అమరావతి రైతులు.. ప్రభుత్వంపై న్యాయపోరాటం ప్రారంభించారు. ప్రభుత్వం నియమించిన.. నిపుణుల కమిటీకి చట్టబద్ధత లేదని.. ఆ కమిటీని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నియమించిన పలు కమిటీలకు చట్టబద్దత లేదన్న అభిప్రాయం ఉంది. పోలవరంపై నియమించిన నిపుణుల కమిటీ విషయంలో ప్రభుత్వమే ఇలాంటి అభిప్రాయాన్ని కేంద్రానికి పంపింది. అలాగే.. పీపీఏల పునంసమీక్షకు పై నియమించిన కమిటీని కూడా హైకోర్టు రద్దు చేసింది. ఎలా చూసినా రాజధానిపై ప్రభుత్వం.. కావాలనే గందరగోళం సృష్టిస్తోందన్న అభిప్రాయం మాత్రం సామాన్యుల్లో వ్యక్తమవుతోంది..