శాసనమండలిలో వైఎస్ఆర్సీపీకి మెజార్టీ ఉంది. ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ వైసీపీకి చెందిన వారు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ప్రభుత్వంపై విరుచుకుపడాల్సిన ఆయన మాట కంటే ముందు వాకౌట్ అంటున్నారు. బీఏసీలో నిర్ణయించిన దాని ప్రకారం ఏదైనా చర్చకు పెడితే అది వద్దని వాదిస్తారు. ముందుగా అనుకున్న ప్రకారమే చర్చలు చేపడుతున్నామని అంటే.. నిరసనగా వాకౌట్ చేస్తారు. మళ్లీ సబ్జెక్ట్ ల వారీగా అదే పని చేస్తారు.
బొత్స సత్యనారాయణపై చాలా పెద్ద బాధ్యత ఉంది. గత ప్రభుత్వంలో నిర్వాకాలు అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణల్ని ఆయనే తిప్పికొట్టాలి. విద్యాశాఖ మంత్రిగా ఆయన పని చేశారు. ప్రభుత్వం చాలా ఆరోపణలు చేసింది. విద్యార్థుల సంఖ్యను కూడా ప్రభుత్వం నమోదు చేయలేదని ఆరోపించారు. దీనిపై బొత్స కౌంటర్ ఇవ్వలేకపోయారు. తన సొంత శాఖకు సంబంధించి కూడా ఆయన గట్టిగా నిలబడలేకపోయారు. ఇక ఇతర విషయాల్లో ఎలా ఉంటారో చెప్పాల్సిన పని లేదు. ఏదైనా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు అనిపిస్తే కౌంటర్ ఇవ్వడం కన్నా బయటకెళ్లిపోవడం మంచిదని అనుకుంటున్నారు.
అందుకే టీడీపీ నేతలు వాకౌట్ పార్టీ.. డ్రాపౌట్ పార్టీ అని సెటైర్లు వేస్తున్నారు. అయితే బొత్స మాత్రం తమపై చేసే ఆరోపణల్ని వింటూ ఉండాలా అని వింతగా ప్రశ్నిస్తున్నారు. మరి వాటిని ఖండించుకోవద్దా అంటే.. మాకు సమయం ఇవ్వడం లేదని రొటీన్ సమాధానాలు చెబుతున్నారు కానీ.. మండలి చైర్మన్ గా ఉన్నది వైసీపీనేతేనని ఆయనకు గుర్తుండటం లేదు. మొత్తంగా జగన్ అసలు రాకుండా బాయ్ కాట్ చేస్తే.. బొత్స మాత్రం వాకౌట్ చేస్తున్నారు.