అమరావతి భూముల విషయంలో ఏపీ సర్కార్ వేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ పెట్టబోయే ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ సిట్‌లో ఆయన సభ్యుడు కాదు. అందులో దర్యాప్తు అధికారులు ఉన్నారు. మరి బొత్స చంద్రబాబు పేరు ఉంటుందని… ఎలా చెబుతున్నారో కానీ.. ఆయన మీడియా ముందు ఆవేశ పడ్డారు. అమరావతిలో పెద్ద ఎత్తున భూ గోల్ మాల్ జరిగిందని.. దళితులను మభ్యపెట్టి.. అసైన్డ్ ల్యాండ్స్‌ను టీడీపీ నేతలు కొనుగోలు చేశారని.. వారి వెనుక చంద్రబాబు ఉన్నారని బొత్స అంటున్నారు. రాష్ట్రంలో ఏదైనా ఓ పెద్ద ఇష్యూ వచ్చినప్పుడు… వైసీపీ నేతుల హఠాత్తుగా అమరావతి భూముల అంశాన్ని తెరపైకి తెస్తారు. అందులో సిట్ అంశంలో దర్యాప్తులో వెలుగు చూసిన విషయాలు మీడియాకు లీక్ చేస్తారు. ఆ తర్వాత వాటిని పట్టుకుని మీడియాలో ఆరోపణలు ప్రారంభిస్తారు. ప్రస్తుతం వైసీపీ నేతలు ఇదే ప్రారంభించారు.
ఓ ఇంగ్లిష్ దినపత్రికలో… అమరావతిలో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని సిట్ గుర్తించిందని అందులో చంద్రబాబు హస్తం ఉందని సిట్ చెబుతోందని.. ఓ వార్త ప్రచురించారు. అందులో.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చేసే ఆరోపణలు బ్రీచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని… మరొకటని మాత్రమే ఉన్నాయి. పూర్తి వివరాలు కూడా లేవు. ఉద్దేశపూర్వకంగా రాయించి.. ఆరోపణలు ప్రారంభిస్తున్నారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. అందుకే యనమల రామకృష్ణుడు.. సిట్ దర్యాప్తులో ఉన్న విషయాలు లీక్ చేయడం కోర్టును ధిక్కరించడమేనని మండిపడ్డారు. నేరపూరిత ఆలోచనలతో పాలన నడుస్తోందన్నారు.
అమరావతి భూముల విషయంలో ఇప్పటికి ఏపీ ప్రభుత్వం అనేక విచారణలు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ చివరికి.. అమరావతికి దూరంగా… సీఆర్డీఏ పరిధి కూడా కాని ప్రాంతంలో హెరిటేజ్ సంస్థ కోసం కొన్న ఐదారు ఎకరాల స్థలాన్ని మాత్రమే చూపిస్తున్నారు. కృష్ణా జిల్లాలో భూముల్ని ఇన్ సైడర్ ట్రేడింగ్‌గా చెబుతున్నారు. కొత్త విషయాలేం చెప్పలేకపోతున్నారు. అయితే.. ఆ విచారణను సీబీఐకి ఇవ్వాలని మాత్రం నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇంత వరకూ ఇవ్వలేదు. సిట్ నివేదికలను మీడియాకు లీక్ చేస్తూ రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు.