మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తన రాజకీయ జీవితం రిటైర్మెంట్ దశకు వచ్చిందని అర్థం చేసుకున్నారు. ఆరోగ్య పరంగా కూడా ఆయన సమస్యలు ఎదుర్కొంటూండటంతో వారసుడ్ని తెరపైకి తేవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఆయన కుమారుడు సందీప్ తెర వెనుక రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నారు. తండ్రి తరపున వ్యవహారాలు చక్కబెడుతూ వచ్చారు. అయితే ఆయన రాజకీయంగా ఎప్పుడూ యాక్టివ్ గా లేరు.
సందీప్ తెర వెనుక సర్దుబాటు చేసే రాజకీయాల వల్ల ఆయనకు పెద్దగా ఫోకస్ రాలేదు. ఎక్కువగా బొత్స మేనల్లుడు చిన్నశీనుకే ఫోకస్ వచ్చింది. బొత్స వారసుడు ఆయనేనని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. చీపురుపల్లి అసెంబ్లీ సీటును గత ఎన్నికల్లో జగన్ఆయనకే కేటాయిస్తారని ప్రచారం జరిగింది.కానీ బొత్సకే ఇచ్చారు. చిన్నశీనుకు ఏ అవకాశం దక్కలేదు. అయితే వచ్చే ఎన్నికల నాటికి బొత్స ఫేడవుట్ అవుతారని చీపురుపల్లి నీదేనని జగన్ చిన్న శీనుకు భరోసా ఇచ్చారని చెబుతున్నారు.
ఈ విషయంపై అవగాహనకు వచ్చిన బొత్స తన కుమారుడ్నియాక్టివ్ చేస్తున్నారు. చీపురుపల్లిలోతన తరపున ఇక వ్యవహారాలు చక్కబెట్టేదే సందీపేనని పార్టీ క్యాడర్ కు సంకేతాలు పంపుతున్నారు. ఇక్కడబొత్స మార్క్ రాజకీయం చేస్తున్నారు. వ్యక్తిగత రాజకీయం ఎక్కువగా చేస్తున్నారు కానీ.. పార్టీ తరపున రాజకీయం తక్కువ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన జనసేన నేతగా ఉంటారన్న ప్రచారం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది.