ప్రజలపై దాడి చేసే బౌన్సర్ల గురించి తరచూ చర్చ జరుగుతూనే ఉంటుంది. అసలు ఈ ప్రైవేటు వ్యక్తులు ఎవరు ప్రజలు పై దాడిచేయడానికి అని చాలా సార్లు ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు మోహన్ బాబు కుటుంబఇష్యూలో అన్నదమ్ములు ఇద్దరూ పోటాపోటీగా బౌన్సర్లను దించి ఘర్షణలకు తెగబడటంతో మరోసారి బౌన్సర్ల అంశంపై చర్చ ప్రారంభమయింది.
ప్రైవేటు సెక్యూరిటీలు చట్టబద్దమే కానీ.. ఆ పేరుతో పోలీసుల అధికారాల్ని సొంతం చేసుకోవడం నిషిద్ధం. బౌన్సర్లు కేవలం వ్యక్తిగత భద్రత కోసం వ్యక్తులు, వ్యాపార సంస్థల దగ్గర కాపలాకు ఉపయోగించుకోవాలి కానీ వారికి దాడులు చేసే అధికారం లేదు. వ్యక్తుల మీదకు మనుషులు చొచ్చుకురాకుండా చూసుకోవడం.. క్యూ లైన్లు ఉండేలా చూడటం వంటి విధులు వారికి ఉంటాయి. అదే సమయంలో ఇలాంటి సమయాల్లో అయినా వారు ఎవరిపై చేయి చేసుకున్నా అది నేరం అవుతుంది. అలాంటి హక్కు వారికి లేదు. కానీ ఇప్పుడు బౌన్సర్లను రౌడీల మాదిరిగా వాడుకుంటున్నారు.
జిమ్ బాడీలతో భయంకరంగా కనిపించేవారిని వెదికి పట్టుకుని బౌన్సర్లను సరఫరా చేసే ఏజెన్సీలు జీతాలిస్తున్నాయి. వారిని ఎవరికి కావాలంటే వారికి సరఫరా చేస్తున్నాయి. కొంత మంది బౌన్సర్లను నెలల తరబడి తమ కాపలాకు ఉంచుకుంటూ ఉంటారు. ఇతర సెక్యూరిటీ సిబ్బందిలా వీరు ఉండరు. వీరిని చూస్తే పక్కవాళ్లకు భయం పుట్టేలా ఉంటుంది. అందుకే ఖర్చు అయినా వీరిని పెట్టుకుంటున్నారు. వీరిని రక్షణకు ఉపయోగించుకోవడం వరకూ కరెక్టే కానీ.. వారితో అసాంఘిక పనులు చేయిస్తే మాత్రం కేసులు అవుతాయి.
బౌన్సర్లు మరీ అతి చేశారని పోలీసులు గుర్తించడంతో వార్నింగ్ ఇచ్చి అందర్నీ పంపేశారు. ఇప్పుడు మోహన్ బాబు ఇంటి వద్ద బౌన్సర్లు లేరు. కానీ వారు అలజడి చేస్తున్నప్పుడు పోలీసులు ఎందుకు చూస్తూ ఉండిపోయారన్నదే కీలకం. బౌన్సర్లను ఇలాంటి అవసరాలకు వాడకుండా.. ఖచ్చితమైన నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ప్రభుత్వంపై పడింది.