తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు ఎక్కడెక్కడి వారినో.. వల వేసి గోవాలాంటి చోట్లకు వెళ్లి మరీ పట్టుకుంటున్నారు కానీ.. కీలక నిందితులుగా చెబుతున్న భార్గవరామ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్, భార్గవరామ్ తల్లి, సోదరుడులను మాత్రం పట్టుకోవడం లేదు. వీరిలో కేసు బయటకు వచ్చిన తర్వాత జగత్ విఖ్యాత్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ తర్వాత ఆయన డ్రైవర్ను పట్టుకోవడం ద్వారా జగత్ విఖ్యాత్ పాత్ర గురించి బయటకు వచ్చిందని పోలీసులు లీక్ చేసి ఆయన కోసం వెదుకుతున్నట్లుగా మీడియాకు సమాచారం ఇచ్చారు. తాజాగా.. భార్గవరామ్ తల్లి, పది రోజుల కిందటే పెళ్లి చేసుకున్న భార్గవరామ్ సోదరుడు చంద్రహాస్లను నిందితులుగా చేర్చారు. వారి కోసమూ వెదుకుతున్నట్లుగా చెబుతున్నారు. అదే సమయంలో.. భార్గవరామ్, గుంటూరు శ్రీనుల గురించి దేశం మొత్తం గాలిస్తున్నట్లుగా చెబుతున్నారు. అందర్నీ పట్టుకుంటున్న పోలీసులు వీరినెందుకు పట్టుకోవడం లేదన్న అనుమానం… సామాన్యుల్లో వస్తోంది.
సాధారణంగా నిందితులందరూ దొరికితే.. అప్పటికే అరెస్టయిన వారికి బెయిల్ వస్తుంది. అఖిలప్రియకు బెయిల్ రాకూడదన్న ఉద్దేశంతోనే… ఇలా కీలక నిందితుల్ని అరెస్ట్ చేయడం లేదని.. ఇంకా కీలకమై నిందితుల్ని పట్టుకోలేదన్న కారణం చెబుతూ.. అఖిలప్రియ బెయిల్ పిటిషన్ను కొట్టి వేయాలని లాయర్లు వాదిస్తారని చెబుతున్నారు. గతంతో.. ఏపీలోనూ ఇలాంటి కేసులు ఉన్నాయని కొంత మంది గుర్తు చేస్తున్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అలాగే అరెస్ట్ చేసి.. ప్రమోద్ రెడ్డి అనే ఏ -3 నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేయలేదు. ఆ కారణం చూపి.. ఆయనను రెండున్నర నెలల పాటు జైల్లో ఉంచారు. చివరికి న్యాయస్థానం ఎన్నాళ్లు జైల్లో ఉంచుతారని ఆగ్రహం వ్యక్తం చేసి బెయిల్ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా అదే వ్యూహంతో ఉన్నారన్న చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం భూ వివాదం సెటిల్మెంట్ కోసం కూడా ఈ కేసును వాడుకుంటున్నారన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణకు చెందిన మధ్యవర్తుల ద్వారా రాజీ ప్రయత్నాలు చేస్తున్నారని గుసగుసలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. భూమా వారసులు ముగ్గురూ చిన్న వాళ్లే కావడంతో వారిని సులువుగా కేసుల భయంతో హ్యాండిల్ చేయవచ్చన్న అభిప్రాయంతో ఉన్నారంటున్నారు. అందుకే.. కేసులో ఒక్క కిడ్నాప్ అంశంపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కుటుంబంలో అందర్నీ కేసుల్లో ఇరికిస్తామన్నట్లుగా హడావుడి చేస్తున్నారు. అదే సమయంలో అసలు భూ వివాదం ఏమిటి.. ఆ భూములపై ఎవరికి హక్కులున్నాయన్న అంశం జోలికి మాత్రం పోలీసులు పోవడం లేదు.