2017కి శుభం కార్డు వేస్తూ.. ఈ యేడాది చివరి వారం రెండు సినిమాలొస్తున్నాయి. ‘ఒక్క క్షణం’ గురువారం వచ్చేస్తోంటే, శుక్రవారం ‘2 కంట్రీస్’ విడుదల అవుతోంది. ఈ యేడాది ఆఖరు సినిమాలు కాబట్టి – ఫలితాలెలా ఉంటాయో… అనే ఆసక్తి నెలకొంది. రెండూ `ఓ మాదిరి` బడ్జెట్ చిత్రాలే. దేన్నీ తేలిగ్గా తీసుకోలేం. అలాగని… అద్భుతాలు సృష్టించేస్తాయన్న ఆశలూ లేవు. రెండింటితో పోలిస్తే ‘ఒక్క క్షణం’ వైపే ప్రేక్షకులు కాస్త మొగ్గు చూపే అవకాశాలున్నాయి. విఐ ఆనంద్ పై తెలుగు ప్రేక్షకులకు గురి కుదిరింది. టైగర్ మంచి సినిమానే. ఎక్కడికి పోతావు చిన్నవాడా కూడా బాగా ఆడింది. దానికి తోడు శ్రీరస్తు శుభమస్తుతో హిట్ కొట్టి జోరుమీదున్నాడు శిరీష్. ఒక్క క్షణం పబ్లిసిటీ కూడా ఓ రేంజులో సాగుతోంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి అల్లు అర్జున్ రావడంతో…. పబ్లిసిటీ పీక్స్‌కి వెళ్లిపోయినట్టే. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలకు పట్టం కడుతున్న ఈ తరుణంలో ‘ఒక్క క్షణం’ మంచి ఫలితాన్నే సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు ‘2 కంట్రీస్’ కూడా విడుదలకు సిద్దం అవుతోంది. అసలే సునీల్ కెరీర్ అంతంత మాత్రంగా నడుస్తోంది. చాలా కాలం తరవాత ఎన్.శంకర్ మెగా ఫోన్ పట్టాడు. పైగా మలయాళ రీమేక్. ట్రైలర్లలో అంత ఊపు కనిపించడం లేదు. పబ్లిసిటీ కూడా కాస్త వీక్‌గానే కనిపిస్తోంది. ఆల్రెడీ ఓ చోట నిరూపితమైన కథ అనేది మినహాయిస్తే… ‘2 కంట్రీస్’కి పెద్దగా ప్లస్ పాయింట్లు ఏం కనిపించడం లేదు. ‘మరీ అంత అద్భుతంగా ఉండదు గానీ, ఈమధ్య సునీల్ నుంచి వచ్చిన సినిమాలతో పోలిస్తే ఇది బెటర్’ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే మాస్లో సునీల్ ఫాలోయింగ్ అలానే ఉంది. అక్కడ ‘ఒక్క క్షణం’తో పోలిస్తే సునీల్ సినిమాకే ఎక్కువ టికెట్లు తెగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ‘ఎంసీఏ’ తన జోరు రెండో వారం చూపించేటట్టే కనిపిస్తోంది. ‘ఒక్క క్షణం’, ‘2 కంట్రీస్’ కలసి కట్టుగా నిలబడితే తప్ప మిడిల్ క్లాస్ అబ్బాయికి స్పీడు బ్రేకర్లు పడవు.