2017 సంక్రాంతి.. బాక్సాఫీసు దగ్గర బిగ్గెస్ట్ ఫైట్ చూడబోతున్నాం. చిరంజీవి, బాలకృష్ణలు నువ్వా, నేనా అంటూ… ఢీ కొట్టబోయే అరుదైన దృశ్యం సంక్రాంతికి ఆవిష్కృతం కానుంది. అవును.. చిరు, బాలయ్యలు సంక్రాంతి బరిలో దిగబోతున్నారు. చిరు కత్తి, బాలయ్య గౌతమి పుత్ర శాతకర్ణి సంక్రాంతికే విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ఆయా చిత్రబృందాలు కూడా అధికారికంగా ప్రకటించడం విశేషం. ఇటీవలే గౌతమి పుత్ర శాతకర్ణి చిత్రం క్లాప్ కొట్టుకొంది. ఈ వారమే.. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఈరోజు చిరంజీవి 150వ చిత్రం కత్తి కూడా లాంఛనంగా ప్రారంభమైంది. కత్తి సినిమానీ సంక్రాంతికే విడుదల చేస్తామని చిత్రబృందం చెబుతోంది. అంటే.. బాలయ్య, చిరు ఫైట్ ఖాయమన్నమాట.
అటు చిరంజీవికి ఇది 150వ చిత్రం.. బాలయ్యకు వందో చిత్రం. ఎవరి దృష్టిలో వారికది ప్రత్యేక చిత్రం. ముందుగా సంక్రాంతికి కర్చీఫ్ వేసుకొని మరీ వస్తున్నారు. 8 నెలల ముందే… సంక్రాంతి బెర్తులు ఖాయం చేసుకొందామని చూస్తున్నారంటే… చిరు, బాలయ్యల ముందు చూపేంటో అర్థమవుతోంది. మరి ఈ అగ్ర కథానాయకుల్లో గెలుపు జెండా ఎగరేసేది ఎవరో తెలియాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.