తన రెండో సినిమా విషయంలో ఆచి తూచి స్పందిస్తున్నాడు అఖిల్. తొలి సినిమా గట్టి దెబ్బకొట్టడంతో ఈసారి అడుగు తడబడకూడదన్న నిర్ణయంతోనే అంత జాగ్రత్త తీసుకొన్నాడు. అయితే మూడో సినిమా విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయదలచుకోలేదు. రెండో సినిమా పట్టాలెక్కకముందే.. తన మూడో సినిమా కూడా కన్ఫామ్ చేసేశాడు అఖిల్. తన మూడో సినిమాకి దర్శకుడు ఎవరో తెలుసా? బోయపాటి శ్రీను. గత రెండ్రోజులుగా బోయపాటి – అఖిల్‌ల మధ్య కథా చర్చలు జరుగుతున్నాయి. అఖిల్ కోసం ఓ సైన్స్ ఫిక్షన్ని బోయపాటి తయారు చేశాడట. ఇది బోయపాటికి సరికొత్త జానర్. ఇప్పటి వరకూ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైన్ మెంట్స్ ని నమ్ముకొన్న బోయపాటి… అఖిల్ సినిమాతో రూటు మార్చాలనుకొంటున్నాడు. తాజాగా కథ విషయంపై ఇద్దరూ ఓ అభిప్రాయానికి వచ్చినట్టు టాక్. బోయపాటి చెప్పిన లైన్.. అఖిల్‌కి బాగా నచ్చిందని, దాన్ని పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేయమన్నాడని తెలుస్తోంది.
బోయపాటి – బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా త్వరలో మొదలవనుంది. ఈ సినిమాపూర్తయ్యాకే.. అఖిల్ సినిమా పట్టాలెక్కుతుంది. అఖిల్ రెండో సినిమా విక్రమ్ కె.కుమార్‌తో ఓకే అయిన సంగతి తెలిసిందే. నవంబరు నెలాఖరున ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. 2017 ఆగస్టులో అఖిల్ రెండో సినిమా విడుదల కానుంది. ఆ తరవాతే.. బోయపాటి సైన్స్ ఫిక్షన్ మొదలవుతుంది.